స్టేషన్లలో  తుపాకుల్లేవ్..సాయుధ ముఠాలను అడ్డుకునేదెలా?

స్టేషన్లలో  తుపాకుల్లేవ్..సాయుధ ముఠాలను అడ్డుకునేదెలా?
  • దోపిడీ ముఠా కాల్పులకు దిగితే చేతులెత్తేయాల్సిందేనా?
  • ప్రస్తుతం ఎస్సై, సీఐల దగ్గరే షార్ట్ వెపన్స్
  • జిల్లా హెడ్ క్వార్టర్స్​లోనే ఆర్మ్​డ్ ఫోర్స్
  • బంగారం షాపుల్లోనూ భద్రత అంతంతమాత్రమే

కరీంనగర్, వెలుగు:కరీంనగర్ లో ఈ నెల 3న జరిగిన జ్యువెలరీ షాపు దోపిడీ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో పోలీస్  శాఖ సంసిద్ధతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెపన్స్ తో ఇలాంటి దోపిడీ ముఠాలు మెరుపు దాడులకు దిగిన సందర్భంలో వారిని పోలీసులు ఏ మేరకు అడ్డుకోగలరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలోని పోలీస్  స్టేషన్లలో కేవలం ఎస్సైలు, సీఐల దగ్గర షార్ట్  వెపన్స్  తప్పితే.. పోలీస్​ స్టేషన్లలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల దగ్గర ఆయుధాలు లేవు. ఇలాంటి ఉగ్రవాద, దోపిడీ ముఠాలు దాడులకు తెగబడితే నిమిషాల వ్యవధిలో పోలీస్  శాఖ ధీటుగా ఎలా ఎదుర్కోగలదనే ప్రశ్న తలెత్తుతోంది.

మావోయిస్టు ప్రాబల్యం తగ్గడంతో ఆయుధాలు డిపాజిట్

గతంలో రాష్ట్రంలో నకల్స్  ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉన్న రోజుల్లో దశాబ్దంన్నర కిందటి వరకు పోలీస్  స్టేషన్లలో ఆయుధాలు ఉండేవి. అంతేగాక వారికి తోడుగా కొన్ని ఏజెన్సీ పోలీస్  స్టేషన్లలో సీఆర్పీఎఫ్  జవాన్లు కూడా ఉండేవారు. ఆ తర్వాత నక్సల్స్  ప్రాబల్యం తగ్గడంతో క్రమంగా పోలీస్ స్టేషన్లలోని తుపాకులను ఆయా జిల్లాల పోలీస్  హెడ్ క్వార్టర్స్ లో డిపాజిట్  చేశారు.

విజయదశమి రోజు ఆయుధ పూజ చేసేందుకు కొన్ని పోలీస్ స్టేషన్లలో ఆయుధాలు లేక హెడ్ క్వార్టర్స్  నుంచి తుపాకులు తెప్పించి.. పూజ అనంతరం మళ్లీ డిపాజిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కరీంనగర్  కమిషనరేట్  పరిధిలో బీఆర్ఎస్  సర్కార్ హయాంలో ఫ్రెండ్లీ పోలీస్  కాన్సెప్ట్ లో భాగంగా కొన్నేళ్లు ఎస్సైలు, సీఐల దగ్గర కూడా ఆయుధాలు ఉండేవి కావు. సీపీగా గౌస్​ ఆలం వచ్చాక ప్రతి ఆఫీసర్  వెపన్  క్యారీ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సీఐలు పిస్టల్స్  వెంట తీసుకెళ్తున్నారు.

కరీంనగర్ దోపిడీ ఘటన విసిరిన సవాల్.. 

కరీంనగర్  పీఎంజే జ్యువెలరీ దోపిడీ ఘటనలో ఐదుగురు డెకాయిట్లు ఐదు షార్ట్  వెపన్స్ తో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు షాపు సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీస్​ ఆఫీసర్లు చుట్టూ అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్  చేయగా ప్రధాన రహదారుల్లో తనిఖీలు చేపట్టారు. పలు చోట్ల తనిఖీలు చేసే పోలీసులు దగ్గర లాఠీలు తప్ప ఆయుధాలు కనిపించలేదు. కానీ, ఆ దొంగలు గ్రామీణ రోడ్లు, కెనాల్స్  వెంట ఉన్న మట్టి రోడ్లపై వెళ్లడంతో పోలీసులకు చిక్కలేదు. ఒక వేళ వారు పోలీసుల తనిఖీల్లో చిక్కినా.. వారు కాల్పులకు తెగబడితే అక్కడ ఉన్న ఎస్సై లేదా సీఐ ఫైర్  చేయడం మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తాయాల్సిన పరిస్థితి ఉండేదనే చర్చ జరుగుతోంది.

ఆయా జిల్లాల పోలీస్  హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఆర్మ్ డ్  ఫోర్స్  ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఇలాంటి ముఠాలు రాష్ట్ర సరిహద్దులు దాటే అవకాశముంది. కరీంనగర్  దోపిడీ ఘటన నేపథ్యంలో ఆయా పోలీస్ స్టేషన్లలోనూ సిబ్బందికి పరిమితంగానైనా ఆయుధాలు అందుబాటులో ఉండాలనే డిమాండ్  వినిపిస్తోంది. 

జ్యువెలరీ షాపుల్లోనూ భద్రత అంతంతమాత్రమే..

కోట్లాది రూపాయల విలువైన బంగారం, వజ్రాల వ్యాపారం చేసే జ్యువెలరీ షాపుల్లో భద్రతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీఎంజే జ్యువెలరీ షాపులో సెక్యూరిటీ లోపాలను ముందే గుర్తించిన ముఠా.. తమ దోపిడీకి ఇదే షాపును అనువుగా భావించినట్లు తెలుస్తోంది. ఈ షాపులో డోర్  సెక్యూరిటీ ఫింగర్  ప్రింట్  ఆధారంగానే ఓపెన్  అవుతుంది.

అంతవరకు బాగానే ఉన్న లోపలికి వచ్చేవాళ్లు ఆయుధాలు, లేదా ఏదైనా పేలుడు పదార్థాలతో వస్తే గుర్తించే డోర్  ఫ్రేమ్  మెటల్  డిటెక్టర్  ఈ షాపులో లేకపోవడం భద్రతా వైఫల్యానికి అద్దంపడుతోంది. ఇది ఉండి ఉంటే మొదటి వ్యక్తి వచ్చినప్పుడే అతడి దగ్గర ఆయుధాన్ని గుర్తించే అవకాశం ఉండేది. కరీంనగర్ లోని చాలా జ్యువెలరీ షాపుల్లో ఇదే పరిస్థితి నెలకొంది.