- 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
- తగ్గిన ఎండ తీవ్రత
- 43 డిగ్రీలకు దిగొచ్చిన టెంపరేచర్లు
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. వర్షాలతో పాటు వడగండ్లు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎత్తయిన ప్రదేశాల్లో ఉండకూడదని, పాత షెడ్లలో, గోడల పక్కన నిలబడరాదని ఎక్స్పర్ట్స్సూచిస్తున్నారు.
తగ్గుముఖం పట్టిన ఎండలు..
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నిన్నమొన్నటి వరకు 45 నుంచి 46 డిగ్రీలదాకా నమోదైన పగటి ఉష్ణోగ్రతలు.. బుధవారం 43 కన్నా తక్కువకు దిగివచ్చాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలలోపే టెంపరేచర్లు నమోదయ్యాయి. కాగా, ఈ ఉపశమనం వచ్చే ఐదు రోజుల పాటే ఉంటుందని, ఆ తర్వాత మళ్లీ పెరిగే అవకాశాలున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ఐదు జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోస్రాలో 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. ఆదిలాబాద్ జిల్లా భోరజ్‌లో 42.6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారంలో 42.4, జగిత్యాల జిల్లా అల్లీపూర్‌లో 42.3, ఖమ్మం జిల్లా ఎన్కూరులో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా నమోదుకాగా.. 19 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 40 డిగ్రీలలోపే రికార్డయ్యాయి. ఇటు హైదరాబాద్సిటీలోనూ టెంపరేచర్లు దిగివచ్చాయి. అంబర్‌పేట, మెహిదీపట్నం, సికింద్రాబాద్సర్కిళ్లు మినహా మిగతా 27 సర్కిళ్లలోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపే రికార్డయ్యాయి. అత్యధికంగా అంబర్‌పేటలో 40.5 డిగ్రీలు, మెహిదీపట్నంలో 40.2, సికింద్రాబాద్‌లో 40.1 డిగ్రీల మేర నమోదయ్యాయి. మరో ఐదు రోజులు టెంపరేచర్లు ఇలాగే నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
