Ram Charan: ఎల్బీ స్టేడియంలో 'పెద్ది' జాతర.. జూన్ 2న భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Ram Charan: ఎల్బీ స్టేడియంలో 'పెద్ది' జాతర.. జూన్ 2న భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది'. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు టాలీవుడ్ లో మునుపెన్నడూ లేని రీతిలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి.

వినూత్నంగా 'పెద్ది' కార్ ప్రమోషన్

సినిమాలోని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌కు తగ్గట్టుగా 'పెద్ది' టీమ్ ఒక వినూత్న ప్రచారానికి తెరలేపింది. రామ్ చరణ్ స్టైలిష్ స్టిల్స్, మూవీ పోస్టర్లతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన 'స్పోర్ట్స్ కార్' ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. దీనికి మ్యాచ్ అయ్యేలా రూపొందించిన కీచైన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మెగా ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెల స్వయంగా ఈ కారును పరిశీలించి, టీమ్ వినూత్న ఆలోచనలను మెచ్చుకున్నారు. ఈ కార్ ప్రమోషన్లను పాన్ ఇండియా లెవల్లో నిర్వహించాలని ఆమె సూచించారు..

 

శృతి హాసన్ ఐటం సాంగ్

ఈ సినిమాలో మరో హైలైట్ ఏమిటంటే.. రామ్ చరణ్, శృతి హాసన్ కాంబినేషన్. 'ఎవడు' తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న భారీ ఐటం సాంగ్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో పూర్తయింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో, ఏఆర్ రెహమాన్ అదిరిపోయే మాస్ బీట్‌తో రూపొందిన ఈ పాట కోసం శృతి హాసన్ దాదాపు రూ. 3 నుండి 3.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. కేవలం ఒకే ఒక్క పాట కోసం ఇంత భారీ మొత్తం వసూలు చేయడం టాలీవుడ్ చరిత్రలోనే ఒక రికార్డుగా మారుతోంది.

ట్రైలర్ ,ప్రీ-రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్స్

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ మే 16, 2026న విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక జూన్ 2న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం సినిమా థీమ్‌కు తగ్గట్టుగా ఒక ప్రత్యేక విలేజ్ సెట్ కూడా సిద్ధమవుతోంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, బొమన్ ఇరానీ, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పవర్‌ఫుల్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.