వెలుగుమట్ల భూదాన్‌‌‌‌ భూముల్లో మోడల్ కాలనీ నిర్మిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

వెలుగుమట్ల భూదాన్‌‌‌‌ భూముల్లో మోడల్ కాలనీ నిర్మిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
  • డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా గృహప్రవేశం చేయిస్తం
  • డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల 
  • భూ నిర్వాసితుల్లో అర్హులకు ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

ఖమ్మం, వెలుగు : వెలుగుమట్లలోని భూదాన్‌‌‌‌ భూముల్లో పేదల కోసం మోడల్ కాలనీ నిర్మిస్తామని, ఇతర ప్రాంతాల వారు సైతం వచ్చి చూసేలా ఈ  కాలనీ ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భూదాన్‌‌‌‌ భూముల్లో ఇండ్లు కోల్పోయిన 311 మంది అర్హులైన నిర్వాసితులకు బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌‌‌‌లో 75 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన పట్టా, ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను మంత్రులు అందజేశారు. మంగళవారం అర్హులకు టోకెన్లు ఇచ్చిన అధికారులు, ర్యాండమైజేషన్‌‌‌‌ పద్ధతిలో ప్లాట్లు కేటాయించారు. కేటాయించిన ప్లాట్లలో అందరూ ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సమక్షంలో సామూహిక గృహప్రవేశాలు జరుపుకోవాలని సూచించారు.

సకల సౌకర్యాలతో లే అవుట్, 16 ఎకరాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ : భట్టి విక్రమార్క

వెలుగుమట్లలో పేదలకు పంచగా మిగిలిన 16 ఎకరాలను తెలంగాణ పబ్లిక్‌‌‌‌ స్కూల్‌‌‌‌ వంటి విద్యా సంస్థల కోసం ఉపయోగిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. భూదాన్‌‌‌‌ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు కరెంటు, నీళ్లు, రోడ్లు, ఆసుపత్రి, కమ్యూనిటీ హాల్, షాపింగ్‌‌‌‌ కాంప్లెక్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇల్లు కట్టిస్తామని పదేండ్ల పాటు మోసగించిన వారికి తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి నాయకత్వంలో రికార్డు స్థాయిలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు రూ.22,500 కోట్లు ఒకేసారి మంజూరు చేశామన్నారు. వెలుగుమట్లలో భూమాఫియా పేదల నుంచి డబ్బులు వసూలు చేసిందని, వారికి బుద్ధిచెప్పి, పేదలు ఆత్మ గౌరవంగా బతికేందుకు చర్యలుతీసుకుంటున్నామన్నారు.  పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చూస్తామని, నిందితుల నుంచి రికవరీ చేసి బాధితులకు ఇస్తామని  హామీ ఇచ్చారు.

మొసలి కన్నీరు కారుస్తున్నారు : పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

గతంలో వెలుగుమట్లలో పేదలు ఏ సౌకర్యాలు లేకుండా నివసిస్తుంటే పట్టించుకోని ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి విమర్శించారు. 2023 ఆగస్టు, సెప్టెంబర్‌‌‌‌లో వెలుగుమట్ల ప్రాంతంలో గత ప్రభుత్వం కూల్చివేతలకు  పాల్పడిందని విమర్శించారు.  పదేండ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పట్టాలు ఇవ్వని వారికి తమపై అవాకులు చవాకులు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. మళ్లీ తమ ప్రభుత్వం వస్తుందని వారు పగటి కలలు కంటున్నారని, వారిని ప్రజలు ఆ కలల్లోనే ఉంచుతారని చెప్పారు. ఈ నెల 1న ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలైన 311 మంది లబ్ధిదారులకు తమ ప్రభుత్వం ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఇచ్చిందని, సొంతూరిలో స్థలం ఉన్న మరో 101 మంది లబ్ధిదారులకు ఎటువంటి భేషజాలు లేకుండా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు. కాలనీలో తాగునీరు, రోడ్లు, ఫంక్షన్‌‌‌‌ హాల్‌‌‌‌, షాపింగ్ కాంప్లెక్స్, స్కూల్, విద్యుత్ సరఫరా వంటి అనేక మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అర్హులైన బాధితులు ఇంకా మిగిలి ఉంటే వారికి కూడా ఇండ్లు మంజూరు  చేస్తామన్నారు.  

పేదలను మోసం చేసిన వారిపై ఉక్కుపాదం మోపుతాం : తుమ్మల  నాగేశ్వరరావు

కొంత మంది ముఠాగా ఏర్పడి పేదల నుంచి రూ.కోట్లలో డబ్బులు వసూలు చేశారని, వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పదేండ్లు ప్రభుత్వంలో ఉన్న వారు ఈ భూదాన్‌‌‌‌ భూముల్లో బారికేడ్లు పెట్టి, సమాంతర పాలన నడుస్తుంటే పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ భూదాన్‌‌‌‌ యజ్ఞ బోర్డు పేరిట ఇచ్చిన పత్రాలు బోగస్ అని, సీసీఎల్ఏ ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని, అక్రమ నిర్మాణాలు కూల్చి దగాకోరులను తరిమివేశామని తెలిపారు.  వెలుగుమట్ల భూదాన్‌‌‌‌ భూములకు సంబంధించి పెద్ద భూ మాఫియా నడుస్తుందని, ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన వారిపై పీడీ యాక్ట్‌‌‌‌ పెట్టాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.  అలాగే కలెక్టర్ అనుదీప్‌‌‌‌ దురిశెట్టి,  పోలీస్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ సునీల్‌‌‌‌దత్‌‌‌‌ మాట్లాడారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య  పాల్గొన్నారు.  

మాకు న్యాయం జరిగింది 

ఎనిమిదేండ్లుగా పాములు, తేళ్ల మధ్యన చీకట్లో మేం పడిన కష్టాలకు ఇప్పటికి న్యాయం దక్కింది. గతంలో రూ.20 వేలు కట్టి కొనుక్కున్నాం. కొందరు తాళి బొట్టు తాకట్టు మరీ నాయకులకు డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మమ్ములను ఆదుకుంటున్న ప్రభుత్వానికి జీవితమంతా రుణపడి ఉంటాం.  - భవాని

స్థలం, ఇల్లు ఇవ్వడం సంతోషంగా ఉంది

రోడ్లు, కరెంటు, నీళ్లు లేకుండా భూదాన్‌‌‌‌ భూముల్లో ఇబ్బందులు పడుతూనే ఎనిమిదేండ్లుగా జీవిస్తున్నాం. ఇంకో చోట కిరాయిలు కట్టలేక ఇక్కడే బతుకుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మా ఇబ్బందులను గుర్తించి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. 
- లక్ష్మీ ప్రసన్న

మమ్మల్ని మోసం చేసిన వారికి శిక్ష పడాలి 

ప్రభుత్వం మాకు ఇంటి స్థలం ఇవ్వడంతో గుర్తింపు, గౌరవం వచ్చింది. మమ్మల్ని ఇన్నేండ్ల నుంచి బెదిరించి, డబ్బులు తీసుకొని మోసం చేసిన వారికి తగిన శిక్ష పడాలి. రూ.3 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా వేర్వేరు ఖర్చుల పేరుతో మా నుంచి నెలనెలా డబ్బులు వసూలు చేశారు. నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు.-  రజిని