
- సినిమా సిటీ కోసం డీపీఆర్ రెడీ చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- థియేటర్లలో ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ధరలను నియంత్రించాలి
- కేబినెట్ సబ్ కమిటీ భేటీకి మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌ను సినిమా సిటీగా అభివృద్ధి చేసి, దేశ, విదేశాల నుంచి సినీ రంగ ప్రముఖులను ఆకర్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇందుకోసం డీపీఆర్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు వివిధ శాఖల నుంచి అనుమతులు తీసుకోవడం సినీ పరిశ్రమకు ఇబ్బందిగా మారిందని.. ఈ సమస్యను పరిష్కరించేందుకు సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఒక అధికారిని నియమించి, వారి ద్వారా అన్ని శాఖల నుంచి అనుమతులు వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అలాగే, మూవీ థియేటర్లలోని క్యాంటీన్లలో తినుబండారాలు, ఇతర వస్తువుల ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 14న ఏర్పాటు చేస్తున్న తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్‌ను ‘న భూతో.. న భవిష్యత్తు’ అన్నట్టుగా ఘనంగా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి తెలుగు సినీ రంగ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సినీ నటులను కూడా ఆహ్వానించాలని చెప్పారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో డిప్యూటీ సీఎం అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.
రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు జరిగేలా ప్రోత్సహించడం ద్వారా పర్యాటక రంగం అభివృద్ధికి అవకాశం ఉంటుందని కేబినేట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. అలాగే, గతంలో ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించిన 50 ఎకరాల భూమి.. ప్రస్తుత పరిస్థితి, వాటి వివరాలను వచ్చే సమావేశం నాటికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, హోం శాఖ స్పెషల్ సీఎస్ రవి గుప్తా, సమాచార శాఖ కమిషనర్ హరీశ్, ఎఫ్‌డీసీ డైరెక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.