బాధితురాలు ఈశ్వరమ్మకు ప్రభుత్వం అండగా ఉంటుంది: డీప్యూటీ సీఎం భట్టి

బాధితురాలు ఈశ్వరమ్మకు ప్రభుత్వం అండగా ఉంటుంది: డీప్యూటీ సీఎం భట్టి

నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. మంత్రి జూపల్లితో కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం భట్టీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు... బాధిత కుటుంబానికి కావాల్సిన ఆర్థిక సాయం చేయాలని సీఎం చెప్పారన్నారు. ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని..వారి పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తామన్నారు. వ్యవసాయం చేసుకుంటామంటే పరిసర ప్రాంతాల్లో భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా నిందితులపై చర్యలు తీసుకుంటామని భట్టివిక్రమార్క తెలిపారు.

కాగా, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను పది రోజులుగా నిర్బంధించి, కొట్టి, మర్మాంగాలపై పచ్చిమిరపకాయల రసాన్ని రుద్ది, చిత్రహింసలకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాధితురాలిని రక్షించి చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.