- వరల్డ్ యాక్సిడెంట్ డే సందర్భంగా ‘అరైవ్ అలైవ్’ క్యాంపెయిన్
- అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి
- ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు చేస్తాం: సీపీ సజ్జనార్
- హాజరైన సినీ నటులు శర్వానంద్, ఆది, బాబుమోహన్, డైరెక్టర్ బుచ్చిబాబు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ‘అరైవ్ అలైవ్’పేరుతో రాష్ట్ర పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ‘వరల్డ్ యాక్సిడెంట్ డే’సందర్భంగా శుక్రవారం ఎల్బీ స్టేడియంలో భారీ క్యాంపెయిన్ నిర్వహించారు. డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్, జాయింట్ సీపీ(ట్రాఫిక్) జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’క్యాంపెయిన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ‘డిఫెన్స్ డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ పాటించు.. ప్రాణాలు కాపాడుకో’అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో నటులు శర్వానంద్, ఆది, బాబుమోహన్, డైరెక్టర్ బుచ్చిబాబు, సింగర్ మనో, నటి అర్చన సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని వివిధ కాలేజీలకు చెందిన దాదాపు 8 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. రోడ్డు ప్రమాదాలు నివారించే విషయంలో పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని డైరెక్టర్ బుచ్చిబాబు అన్నారు. సిట్ బెల్ట్ వేసుకోవాలని డైరెక్టర్ సుకుమార్ తనతో ప్రామిస్ చేయించుకున్నారని చెప్పారు.
బాబు మోహన మాట్లాడుతూ.. ‘‘నేను మా అన్న కోట శ్రీనివాస్ రావు సినిమాల్లో నవ్వించాం. కానీ రోడ్డు ప్రమాదాల రూపంలో మా కొడుకులను కోల్పోయాం. నా నటనతో అందరినీ నవ్విస్తూ.. నేను మాత్రం 23 ఏండ్లుగా ఏడుస్తూనే ఉన్నాను. ట్రాఫిక్ రూల్స్ పాటించడం సమాజానికి సేవ చేయడమే. సినిమాల్లో హీరోలలాగా బైక్ డ్రైవ్ చేయకండి.. మీ తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చకండి”అని అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ.. ‘‘మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టు వెళ్లొద్దు. ట్రాఫిక్ రూల్స్ పెట్టింది మన కోసమే. హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకొని వాహనాలు నడపాలి. రియల్ లైఫ్‌లో పోలీసులే హీరోలు. యాక్సిడెంట్ జరిగినప్పుడు బాధితుడిని ఆసుపత్రికి తరలించినోడే హీరో. సహాయం చేస్తే మీరే లైఫ్‌లో రియల్ హీరో అవుతారు”అని పేర్కొన్నారు.
ప్రమాదాల నివారణకు యువత కృషి చేయాలి..
రోడ్డు ప్రమాదాల నివారణ ఒక్క పోలీసుల బాధ్యతే కాదు.. యువత, విద్యార్థులు అందరూ దీని కోసం కృషి చేయాలి. అరవై అలైవ్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తాం. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ పెట్టుకుంటారని కానీ దానికి ఉన్న బెల్ట్ పెట్టుకోరు. దీనివల్ల ప్రయోజనం ఉండదు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు డ్రైవ్ చేస్తారు. యాక్సిడెంట్ జరిగితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావు. దీంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించడమే కాదు ఎదుటి వారిని కూడా రూల్స్ పాటించేలా చేయాలి.-
శివధర్ రెడ్డి, డీజీపీ ప్రమాదాల్లో ఏటా 1.7 లక్షల మంది చనిపోతున్నరు..
దేశంలో ఏటా 4.5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో 1.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్‌లో 3,000 ప్రమాదాలు జరుగుతుండగా.. 300 మంది మృతి చెందుతున్నారు. 3,500 గాయాల పాలవుతున్నారు. ఇలాంటి ప్రమాదాల నివారణకు ఇకపై కఠినంగా వ్యవహరిస్తాం. స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి రూల్స్ పాటించని వారి వెహికల్స్ సీజ్ చేస్తాం. జీవధాన్ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడంలో సిటీ ట్రాఫిక్ పోలీసులు దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలి. అలాంటి వారిని ప్రతి నెల గౌరవిస్తాం.- సజ్జనార్, సీపీ, హైదరాబాద్
