కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ విషాదంగా మిగిలింది. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ చెరువులో చిన్నారులు పడి చనిపోగా వీరి డెడ్‌బాడీలు శనివారం బయటపడ్డాయి. టౌన్ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గోసింగి కాలనీకి చెందిన పనేటి సింహాద్రి అలియాస్ నరసింహ(10), ఇతని బంధువు కోదండ విజయ్(9) ఈ నెల 6న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.
చుట్టు పక్కల, బందువుల ఇండ్లలో వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో సింహాద్రి తల్లి పనేటి శారద తన కొడుకుతో పాటు తన అన్న కొడుకు విజయ్ కనిపించడం లేదని ఈ నెల 7న టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఇద్దరు పిల్లల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలోని చెరువులో ఇద్దరు చిన్నారుల డెడ్‌బాడీలు ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడకు వెళ్లి పరిశీలించారు. గోసంగి కాలనీ నుంచి మిస్సింగ్ అయిన ఇద్దరు చిన్నారులేనని నిర్ధారించారు. చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయినట్లు ఆనవాళ్లు ఉన్నాయని సీఐ తెలిపారు.
