కర్నాటకలో పొలిటికల్ హీట్.. ఢిల్లీకి డీకే క్యాంప్ ఎమ్మెల్యేలు

కర్నాటకలో పొలిటికల్ హీట్.. ఢిల్లీకి డీకే క్యాంప్ ఎమ్మెల్యేలు
  • పవర్ షేరింగ్ ఒప్పందం అమలు కోసం డిమాండ్  

బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రంలో వెంటనే పవర్ షేరింగ్ (అధికార పంపిణీ) ఒప్పందాన్ని అమలు చేయాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులు కోరారు. ఈ మేరకు డీకే శివకుమార్ ను సపోర్ట్ చేస్తున్న 10 మంది ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ వెళ్లిన వారిలో దినేశ్ గూళిగౌడ, రవి గణిగ, గుబ్బి వాసులతో పాటు పలువురు ఉన్నారు. ఇదే అంశంపై అనేకల్ శివన్న, నెలమంగళ శ్రీనివాస్, ఇక్బాల్ హుస్సేన్, కునిగల్ రంగనాథ్, శివగంగా బసవరాజు, బాలకృష్ణలు కూడా శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరంతా  2.5 ఏండ్ల క్రితం చేసిన వాగ్దానాన్ని గౌరవించాలని ఖర్గెను కోరనున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కసిరెడ్డి వేణుగోపాల్‌‌‌‌తోనూ సమావేశం కానున్నారు.

 2023 మే 20న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల  తర్వాత సీఎం ఎవరనే దానిపై సిద్దరామయ్య, శివకుమార్ మధ్య తీవ్ర పోటీ జరిగింది. శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడితే.. రెండున్నరేండ్ల తర్వాత అధికారం ఇస్తామని హైకమాండ్ దగ్గర ఒప్పందం జరిగినట్లు అప్పట్లో కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే, పార్టీ మాత్రం ఈ ఒప్పందాన్ని ఎప్పుడూ అధికారికంగా ధ్రువీకరించలేదు. కాగా, తాజా పరిణామాలపై సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ..నవంబర్ రెవల్యూషన్ అనే పదాన్ని మీడియా సృష్టి మాత్రమేనని తెలిపారు. తన నేతృత్వంలోని  ప్రభుత్వమే పూర్తి ఐదేండ్లు పాలన చేస్తుందని స్పష్టం చేశారు. పూర్తి కాలం పదవిలో ఉంటానా అనే ప్రశ్నపై చర్చలు అనవసరమన్నారు. కేబినెట్ మార్పులపై ఖర్గె, రాహుల్ గాంధీతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.