
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని కాలువలను శుభ్రం చేసేందుకు జీహెచ్ఎంసీ లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తుంది. ఇందుకోసం సర్కిల్-12 మెహిదీపట్నంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఈ మేరకు గురువారం పలు వరద నీటి కాలువలను రోబోటిక్ టెక్నాలజీతో క్లీన్ చేశారు. పనులను జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్(మెయింటనెన్స్) చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. సిటీలో చిన్నపాటి వర్షాలకే డ్రైన్లు పొంగిపొర్లడం, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవ్వడం, ట్రాఫిక్ జామ్ వంటి ఘటనలు జరుగుతున్నాయని, రోబోటిక్ టెక్నాలజీ సక్సెస్ అయితే ఈ ఘటనలను చాలా వరకు తగ్గించవచ్చన్నారు.
బుధవారం రాత్రి మెహిదీపట్నం ఎన్ఎండీసీ జంక్షన్లో క్లీనింగ్ పనులు చేపట్టినట్లు తెలిపారు. కాలువల్లోని బురదను వేగంగా, సమర్థవంతంగా తొలగించడం, వర్షాల సమయంలో నీటి నిల్వలను తగ్గించి డ్రైనేజ్ సామర్థ్యాన్ని పెంపొందించటమే ఈ నూతన టెక్నాలజీ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు.