హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీజీ ఎప్ సెట్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. తొలిరోజు సోమవారం అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ విద్యార్థులకు పరీక్షలు జరగ్గా.. 93 శాతానికి పైగా హాజరు నమోదైంది. ఫస్ట్ సెషన్లో 30,333 మందికిగానూ 28,046 (92.46%) మంది పరీక్ష రాశారు. సెకండ్ సెషన్లో 30,253 మందికి గాను 28,241 (93.35%) మంది హాజరయ్యారని ఎప్ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్లో అత్యధికంగా 98 శాతం హాజరు నమోదని చెప్పారు.
కాగా, పరీక్షల నిర్వహణను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి, ఎప్ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు. సీబీటీ ఎగ్జామ్స్ కావడంతో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం కూడా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు కొనసాగనున్నాయి.
