అమ్మ ఒడి అవినీతిని బయటపెడతాం.. జగన్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్

అమ్మ ఒడి అవినీతిని బయటపెడతాం.. జగన్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్

ప్రభుత్వం మారిన వెంటనే మొట్టమొదటగా వైసీపీ ప్రభుత్వంలో  జరిగిన  అవినీతి, చేసిన కుంభకోణాలపై దృష్టిపెడతామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యా శాఖ నిధుల్లో  అవినీతి , కుంభకోణంతో  సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ జైలుకి పంపుతామని   పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పతనావస్థలో ఉన్న కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి విద్యా వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. మంత్రి బొత్స సత్యనారాయణ జనసేన పార్టీ గురించి మాట్లాడినా, కించపర్చే విధంగా మాట్లాడినా పట్టించుకునేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి విద్యా వ్యవస్థలో చాలా అవకతవకలు జరిగాయన్నారు. వైసీపీ ప్రభుత్వం  విద్యార్ధులను అయోమయానికి గురి చేస్తోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇంగ్లీష్ మీడియం అంశం మీద సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే ... మేమేదో ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం అని అవాకులుచవాకులు మాట్లాడారన్నారు.   అమెరికాలోని యూనివర్సిటీలకు వెళ్లే విద్యార్ధులకు టోఫెల్ టెస్ట్ అవసరమంటూ... 3వ తరగతి, 5వ తరగతి పిల్లలకు టోఫెల్ టెస్ట్ పెట్టడం వెనుక లాజిక్ అర్ధం కావడం లేదన్నారు.

నాదెండ్ల మనోహర్ ఏమన్నారంటే

పేదలకు నాణ్యమైన విద్య పేరుతో ప్రభుత్వ ఖజానాకు భారంగా మారే ఒప్పందాలు జగన్ ప్రభుత్వం చేసుకుంటోంది అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. టీచర్లకు జీతాలివ్వడంలో విఫలమవుతోన్న ప్రభుత్వం ఇతర దేశాలకు చెందిన సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది.. ప్రాథమిక అంశాలను పక్కన పెట్టి.. విద్యా రంగంలో కొత్త విధానాలను ప్రవేశపెడుతోంది.. టోఫెల్ శిక్షణ కోసం 54 పేజీల ఒప్పందం.. ఆ ఒప్పందాన్ని మంత్రి బొత్స చదవాలని ఆయన అన్నారు. ఇక ఐబీ సంస్థతో మరో ఒప్పందం కుదుర్చుకుంది.. భారత దేశ చట్టాలు ఐబీ సంస్థకు వర్తించవట.. ఏమైనా తేడా వస్తే జెనీవా కోర్టులో తేల్చుకోవాలంట.. టీచర్ల ట్రైనింగ్ నిమిత్తం రూ. 1200 కోట్ల నుంచి రూ. 1500 కోట్లు ఖర్చు పెట్టేలా ఒప్పందం చేసుకున్నారని నాదెండ్ల మనోహార్ అన్నారు. 5.71 లక్షల మంది విద్యార్థుల పేరుతో అమ్మ ఒడి నిధులు, విద్యా కానుక నిధులు పక్కదారి పట్టాయని నాదెండ్ల ఆరోపించారు..  రూ. 743 కోట్ల మేర అమ్మఒడి నిధులు పక్కదారి పట్టాయన్నారు. 

అమ్మఒడిలో స్కాం జరిగింది..  మంత్రి బొత్స పదే పదే ఒప్పందాలన్నీ కెబినెట్ నిర్ణయం మేరకు జరిగాయని ఎందుకు చెప్పుకొచ్చారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పేద విద్యార్థుల పేరుతో దోపిడీ జరుగుతోంది.. ఐబీ కరిక్యులమ్ తీసుకురావాలని ఎందుకు ఇంత ఒత్తిడి తెస్తున్నారు? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఈ ఒప్పందాల వెనుకున్న మతలబేంటీ? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. రూ. 100 కోట్ల దాటిన ప్రతి కార్యక్రమానికి జుడిషియరీ ప్రీవ్యూ ముందు పెడతామన్నారు.. ఇప్పుడెందుకు పెట్టలేదు.. విద్యాశాఖలో మరిన్ని స్కాంలు జరిగాయి.. అవి త్వరలో బయటపెడతాం అని ఆయన తెలిపారు.