వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్స్ విజేత రిబకినా

వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్స్ విజేత రిబకినా
  • ట్రోఫీ నెగ్గిన తొలి కజక్ ప్లేయర్ గా రికార్డు
  • దాదాపు రూ. 19 కోట్ల ప్రైజ్ మనీ సొంతం

లండన్‌‌‌‌: 
కజకిస్తాన్‌‌ నయా సంచలనం ఎలెనా రిబకినా.. తొలిసారి వింబుల్డన్‌‌లో మహిళల చాంపియన్‌‌గా నిలిచింది. శనివారం జరిగిన సింగిల్స్‌‌ ఫైనల్లో 17వ సీడ్‌‌ రిబకినా 3–6, 6–2, 6–2తో మూడోసీడ్‌‌ ఆన్స్‌‌ జబెర్‌‌ (ట్యూనీసియా)పై గెలిచింది. దీంతో కజకిస్తాన్‌‌ నుంచి గ్రాండ్‌‌స్లామ్‌‌ నెగ్గిన తొలి ప్లేయర్‌‌గా రికార్డు సృష్టించింది. అలాగే 2011 తర్వాత వింబుల్డన్‌‌ ట్రోఫీ నెగ్గిన యంగెస్ట్‌‌ ప్లేయర్‌‌గానూ రికార్డులకెక్కింది. మాస్కోలో పుట్టిన 23 ఏళ్ల రిబకినా.. 2018 నుంచి కజక్‌‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నది. 1962 తర్వాత ఆల్‌‌ ఇంగ్లండ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇద్దరు అరంగేట్రం ప్లేయర్ల మధ్య ఫైనల్‌‌ జరగడం కూడా ఇదే తొలిసారి. ప్రస్తుతం 23వ ర్యాంక్‌‌లో ఉన్న రిబకినా.. వీనస్‌‌ విలియమ్స్‌‌ (2017లో 31వ ర్యాంక్‌‌) తర్వాత వింబుల్డన్‌‌ గెలిచిన అతి తక్కువ ర్యాంక్‌‌ ప్లేయర్‌‌. 

తొలి సెట్‌‌ ఓడినా..
గంటా 48 నిమిషాల పోరాటంలో రిబకినా.. స్ఫూర్తిదాయక పోరాటం చూపెట్టింది. బలమైన సర్వీస్‌‌లు, పవర్‌‌ఫుల్‌‌ ఫోర్‌‌హ్యాండ్‌‌ షాట్స్‌‌తో జబెర్‌‌ను కట్టడి చేసింది. అయితే ఆరంభంలో రిథమ్‌‌ లభించక ఇబ్బందులుపడిన రిబకినా.. తర్వాత తనదైన ఆటతో జబెర్‌‌ 12 వరుస విజయాల రికార్డుకు బ్రేక్‌‌ వేసింది. స్టార్టింగ్‌‌లో పదునైన సర్వ్‌‌లతో విరుచుకుపడిన జబెర్‌‌.. మూడు, తొమ్మిదో గేమ్‌‌లో రిబకినా సర్వ్‌‌ను బ్రేక్‌‌ చేసి సెట్‌‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌‌లో సీన్‌‌ రివర్స్‌‌ అయ్యింది. తొలి, ఐదో గేమ్‌‌ల్లో జబెర్‌‌ సర్వీస్‌‌ కోల్పోవడంతో రిబకినా 4–1తో లీడ్‌‌లో నిలిచింది. ఇక్కడి నుంచి ఇద్దరూ సర్వీస్‌‌లను కాపాడుకున్నా.. కజక్‌‌ ప్లేయర్‌‌ ఈజీగా సెట్‌‌ను సాధించి మ్యాచ్‌‌లో నిలిచింది. ఇక డిసైడర్‌‌లో బ్యాక్‌‌హ్యాండ్‌‌ షాట్లతో రెచ్చిపోయిన రిబకినా.. ఫస్ట్‌‌, ఏడో గేమ్‌‌లో జబెర్‌‌ సర్వీస్‌‌ను బ్రేక్‌‌ చేసి విజయం సాధించింది. మ్యాచ్‌‌ మొత్తంలో ఇద్దరు చెరో నాలుగు ఏస్‌‌లు సంధించారు. రిబకినా మూడు డబుల్‌‌ ఫాల్ట్స్‌‌ చేస్తే, జబెర్‌‌ ఒకటితో సరిపెట్టుకుంది.