సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆస్తులు జప్తు : ఈడీ

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆస్తులు జప్తు  : ఈడీ
  • స్థిర, చరాస్తుల మార్కెట్‌‌ వాల్యూ రూ.50 కోట్లపైనే : ఈడీ
  • సరోగసి పేరిట పిల్లల అమ్మకాలతో మనీలాండరింగ్‌‌ చేసిన డాక్టర్ నమ్రత 

హైదరాబాద్‌‌, వెలుగు: యూనివర్సల్‌‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. సరోగసి పేరిట మోసాలు, పిల్లల అక్రమ రవాణాకు పాల్పడిన డాక్టర్‌‌‌‌ నమ్రత, ఆమె కుమారుడికి చెందిన రూ.29.76 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం మంగళవారం వివరాలు వెల్లడించింది. ఫెర్టిలిటీ సెంటర్స్‌‌ ద్వారా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన భూములు, ఫ్లాట్స్‌‌ సహా స్థిరచరాస్తులను జప్తు చేసినట్టు తెలిపింది. వీటి విలువ ప్రస్తుత మార్కెట్‌‌ వాల్యూ ప్రకారం రూ.50 కోట్లుగా అంచనా వేస్తున్నారు. అక్రమ సరోగసీ, శిశు అక్రమ రవాణా ఆరోపణలకు సంబంధించి  గోపాలపురం పోలీస్ స్టేషన్‌‌లో నమోదైన పలు ఎఫ్‌‌ఐఆర్‌‌ల ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది. డాక్టర్ నమ్రత యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో క్లినిక్ నిర్వహిస్తూ తన ఉద్యోగులు, ఏజెంట్ల సహాయంతో అక్రమ సరోగసీ రాకెట్ నడిపినట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

సంతానం లేని దంపతులకు సరోగసీ ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామని చెప్పి భారీ మొత్తాలు వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలను పెంచలేని పరిస్థితిలో ఉన్న గర్భిణులకు నమ్రత ముఠా సభ్యులు డబ్బు ఆశ చూపించి ప్రసవం తర్వాత శిశువును వారికి ఇచ్చేలా  ప్రలోభపెట్టినట్టు దర్యాప్తులో తేలింది. ఇలా డాక్టర్ నమ్రత ఆడ శిశువుకు సుమారు రూ.3.5 లక్షలు, మగ శిశువుకు రూ.4.5 లక్షలు చెల్లించేవారని ఈడీ గుర్తించింది. ఈ ప్రసవాలను విశాఖపట్నంలోని ఆమె ఆస్పత్రిలో నిర్వహించేవారని అధికారులు తెలిపారు.   డాక్టర్ నమ్రత 2014 నుంచి ఈ అక్రమ సరోగసీ రాకెట్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ఇప్పటికే కేసులు నమోదై, ఆమె లైసెన్స్ సస్పెండ్ అయినప్పటికీ కార్యకలాపాలు కొనసాగించినట్టు వెల్లడైంది. సంతానం లేని దంపతుల నుంచి చెక్కులు, నగదు రూపంలో వసూలు చేసిన డబ్బులో కొంత భాగాన్ని ఏజెంట్లు, సబ్ ఏజెంట్లకు కమీషన్‌‌గా చెల్లించగా, మిగిలిన భాగాన్ని శిశువుల తల్లిదండ్రులకు ఇచ్చినట్టు బ్యాంక్ ఖాతాల విశ్లేషణలో బయటపడింది. ఈ కేసులో భాగంగా ఈడీ అధికారులు డాక్టర్‌‌ నమ్రతను  ఫిబ్రవరి 12న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలికితీయడానికి ఈడీ దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.