‘ఎంగిలి పూల’ సంబురం

‘ఎంగిలి పూల’ సంబురం

“ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో”...“చిత్తూ చిత్తూల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ’’.. అంటూ మహిళలు, యువతుల ఆట పాటలతో సిటీలోని కాలనీలు, బస్తీల్లో సందడి నెలకొంది. బుధవారం ఎంగిలి పూల బతుకమ్మ తో పండుగ సంబురం మొదలైంది. చిన్నా పెద్దా అందంగా, సంప్రదాయంగా ముస్తాబై తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలను తెచ్చి ఒక చోట చేర్చారు. వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడి పాడుతూ ఉత్సాహంగా నిర్వహించుకున్నారు.  కూకట్​పల్లి, రవీంద్ర భారతి, తార్నాక, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, ఫిలింనగర్ తదితర ప్రాంతాల్లో పండుగ చేసు కుని చెరువు ల్లో బతుకమ్మలను వదిలారు. మొదటి రోజు సిటీ అంతటా పండుగ వాతావ రణం కనిపించింది.  తొమ్మిది రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ పండుగకు రోజుకో విశిష్టత ఉంటుంది. 

బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ తమిళిసై
రాజ్​భవన్‌‌లో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్, ఆమె కుటుంబ సభ్యులు, రాజ్​భవన్ మహిళా ఉద్యోగులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్​ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. 9 రోజుల పాటు తెలంగాణ ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ.. బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని ఆమె సూచించారు.   - హైదరాబాద్, వెలుగు