బెంగళూరు: బెంగళూరు నుంచి దేశంలోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్ గోవా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. త్వరలోనే బెంగళూర్-గోవా మధ్య వందేభారత్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. కేవలం 13 గంటల్లోనే బెంగళూర్ నుంచి గోవా చేరుకోవచ్చు. ఈ మేరకు సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) ప్రతిపాదిత రిపోర్ట్‌ను రైల్వే బోర్డుకు సమర్పించింది. బోర్డు ఈ ప్రతిపాదనను ఆమోదించిన తర్వాత కొత్త వందే భారత్ షెడ్యూల్ అధికారికంగా ప్రకటించబడుతుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.
బెంగళూర్ టూ గోవా వందే భారత్ వెళ్లే మార్గం, టైమింగ్స్ ఇవే:
సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) ప్రతిపాదనల ప్రకారం.. వందే భారత్ ట్రైన్ బెంగళూరులోని యశ్వంత్‌పూర్ నుంచి ప్రారంభమై గోవాలోని మడ్గావ్ వరకు వెళుతుంది. తాత్కాలిక టైమ్‌టేబుల్ ప్రకారం.. వందే భారత్ ఉదయం 6:05 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి సాయంత్రం 7:15 గంటలకు మడ్గావ్ చేరుకుంటుంది.
►ALSO READ | ఎగ్జామ్స్ కు ముందే పేపర్ లీక్..వాట్సాప్ గ్రూప్ లో 12 వ తరగతి కెమిస్ట్రీ పేపర్, ఆన్సర్లు
తిరుగు ప్రయాణంలో మడ్గావ్ నుంచి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:40 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు మంగళూరు జంక్షన్, మంగళూరు సెంట్రల్ స్టేషన్ల మీదుగా పాడిల్ బైపాస్ గుండా వెళుతుంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చల్లో ఉందని రైల్వే బోర్డు సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు.
ఈ ప్రతిపాదనపై చర్చలు కొనసాగుతున్నాయని,, అన్ని వివరాలపై ఒప్పందం కుదిరిన తర్వాత ప్రకటన వెలువడుతుందని ఆయన పేర్కొన్నారు. రైల్వే బోర్డు నుంచి ఆమోదం లభిస్తే సర్వీస్ ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రారంభానికి ముందు ట్రయల్ రన్లు నిర్వహించనున్నారు.
