T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8 దశలో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ రెండు జట్లకూ సూపర్–8 రౌండ్‌లో తొలి మ్యాచ్. సెమీఫైనల్ బెర్త్ దిశగా కీలక అడుగు వేయాలనే లక్ష్యంతో ఇరు జట్లు ఈ పోరుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. గ్రూప్ దశలో భారత్, దక్షిణాఫ్రికా రెండూ తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచాయి. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపులో సూపర్–8లోకి అడుగు పెట్టాయి. ఈ విజయ పరంపరను కొనసాగించాలనే పట్టుదలతో ప్రోటిస్– మెన్ ఇన్ బ్లూ టీమ్స్ బరిలోకి దిగనున్నాయి.
హెడ్ టు హెడ్ రికార్డులు:
టీ20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు మొత్తం 35 సార్లు తలపడ్డాయి.
* మ్యాచ్‌లు: 35
* భారత్ గెలుపులు: 21
* దక్షిణాఫ్రికా గెలుపులు: 13
* మ్యాచ్ టై: 1
టీ20 వరల్డ్ కప్‌లో హెడ్ టు హెడ్:
టీ20 వరల్డ్ కప్‌లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 7 సార్లు పోటీపడ్డాయి. అందులో భారత్ 5 మ్యాచ్‌లలో విజయం సాధించింది.
* మ్యాచ్‌లు: 7
* భారత్ గెలుపులు: 5
* దక్షిణాఫ్రికా గెలుపులు: 2
గత టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఈ రెండు జట్లు తలపడ్డాయి. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్ దక్షిణాఫ్రికా అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.
ఇరు జట్ల ప్రదర్శన?..
భారత్:
గ్రూప్ దశలో భారత్ గ్రూప్–Aలోని పాకిస్తాన్, USA, నెదర్లాండ్స్, నమీబియాలపై విజయం సాధించింది. అన్ని మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసి, లక్ష్యాలను సమర్థవంతంగా కాపాడుకుంది.
నమీబియాపై 93 పరుగులతో, పాకిస్తాన్‌పై 61 పరుగులతో గెలవడం భారత్‌కు హైలైట్‌గా నిలిచాయి.
దక్షిణాఫ్రికా:
దక్షిణాఫ్రికా టోర్నీని కెనడాపై 57 పరుగుల విజయంలో ప్రారంభించింది. ఆ తర్వాత అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లగా, థ్రిల్లర్‌లో ప్రోటీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై 176 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లతో ఛేదించి గెలిచింది. చివరగా UAEపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ సూపర్–8లో ఇది తొలి మ్యాచ్ కావడంతో.. ఈ పోరు ఫలితం సెమీఫైనల్ అవకాశాలపై కీలక తీవ్ర ప్రభావం చూపనుంది. ఇరు జట్లు సమంగా బలంగా కనిపిస్తుండటంతో.. అభిమానులకు మరో హై వోల్టేజ్ మ్యాచ్ ఖాయంగా కనిపిస్తోంది.
►ALSO READ | IND vs PAK: మళ్ళీ సెమీఫైనల్లో భారత్ vs పాకిస్తాన్?.. విశ్లేషకులు ఏమ్మన్నారంటే..!
