నందిగామ గ్రామంలో ఐదవ తరగతి వరకు మాత్రమే ప్రభుత్వ పాఠశాల ఉంది. హైస్కూల్‌లో చదువుకోవడానికి పది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే రామాయంపేట వస్తుంది. అక్కడికి రోజూ నడుచుకుంటూ బడికి వెళ్లేవాడు వంశీ. శ్రద్ధగా చదువుకునేవాడు. వంశీకి చదువంటే ఎంత ఇష్టమంటే.. ఆ పది కిలోమీటర్ల దూరం కూడా అతనికి ఆటంకంగా కనిపించలేదు. రోజూ ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి, తల్లి పెట్టిన చద్దన్నం తిని, తన పాత పుస్తకాల సంచి భుజాన వేసుకుని బయలుదేరేవాడు. దారిలో కాళ్లకి ముళ్లూ, రాళ్లూ గుచ్చుకున్నా, వర్షంలో తడిచినా, ఎండలో మాడినా అతనికి లెక్కేలేదు. తన లక్ష్యం ఒక్కటే.. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలి.
ఒకరోజు వంశీ రామాయంపేట వైపు వెళ్తుండగా, దారిలో ఒక లారీ ఆగి ఉంది. డ్రైవరు కిందికి దిగి టైరు మార్చుకుంటున్నాడు. వంశీని చూసి డ్రైవరు, “అబ్బాయి, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావ్?” అని అడిగాడు. “బడికి అంకుల్, రామాయంపేటలో చదువుకుంటున్నాను” అని చెప్పాడు వంశీ.
డ్రైవరు ఆశ్చర్యపోయి, “అంత దూరం నడుచుకుంటూ వెళ్తావా? నిజంగా నీ పట్టుదలకు మెచ్చుకోవాలి” అంటూ వంశీని తన లారీలో ఎక్కించుకున్నాడు.
ఆరోజు నుంచి ప్రతిరోజూ ఆ డ్రైవర్ వంశీని తన లారీలో బడి దగ్గర దించేవాడు. డ్రైవర్ పేరు శివయ్య. అతను కూడా పేదరికంలో పెరిగినవాడే. అందుకే వంశీ కష్టాన్ని అర్థం చేసుకున్నాడు. శివయ్య సాయంతో వంశీ సమయానికి బడికి వెళ్లడం, తిరిగి రావడం కుదిరింది. చదువుపై మరింత శ్రద్ధ పెట్టగలిగాడు.
ఆ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో వంశీ రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించాడు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా వంశీ తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ తరువాత, వంశీకి మంచి కాలేజీలో సీటు లభించింది. చదువు పూర్తయ్యాక, సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది.
►ALSO READ | టూల్స్ అండ్ గ్యాడ్జెట్స్: ఒకేసారి మూడు పనులు చేసే.. పెట్ బ్రష్
వంశీ తన జీతం డబ్బులతో తల్లిదండ్రులకు ఒక కొత్త ఇల్లు కట్టించాడు. ఆ ఇంటికి ‘‘శివయ్య నివాస్’’ అని పేరు పెట్టాడు. తన కష్టంలో తోడుగా నిలిచిన శివయ్యను జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేదు. వంశీ పట్టుదల, శివయ్య దయతో నందిగామ గ్రామంలో ఒక కొత్త ప్రేరణ మొదలైంది. పిల్లలందరూ కష్టపడి చదువుకోవడం మొదలుపెట్టారు.
- యాడవరం రేవంత్ గౌడ్-
