ఆదివాసీ కళా సంపద రక్షణకు అందరూ ముందుకు రావాలి

ఆదివాసీ కళా సంపద రక్షణకు అందరూ ముందుకు రావాలి
  • ఉస్మానియాలో ఆద్యకళా మ్యూజియం ఏర్పాటుకు సహకరించాలి
  • ప్రజా సంఘాల నేతలు, మేధావుల పిలుపు

హైదరాబాద్​ సిటీ, వెలుగు:  ఉస్మానియా యూనివర్సిటీలో ఆద్యకళా మ్యూజియం ఏర్పాటు చేసేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని వక్తలు కోరారు. ఓయూలో ఆద్యకళా మ్యూజియం ఏర్పాటుపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌లో ప్రజా సంఘాలు, ప్రొఫెసర్లు, సీనియర్  జర్నలిస్టులు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. సీనియర్  ఎడిటర్  కె. శ్రీనివాస్​ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, సీనియర్  జర్నలిస్ట్  రామచంద్రమూర్తి, భూమిక ఎడిటర్  కొండవీటి సత్యవతి, రచయిత సన్నిధాన శర్మ  పాల్గొన్నారు. 

ఎమ్మెల్సీ కోదండరాం​మాట్లాడుతూ.. ప్రొఫెసర్  జయధీర్  తిరుమలరావు ఐదు దశాబ్దాలుగా చత్తీస్‌‌గఢ్, ఇతర ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించి సేకరించిన 5,000కు పైగా కళా ఖండాలు, తాళపత్ర గ్రంథాలు, సంగీత పరికరాలు, రాత పరికరాలతో ఈ మ్యూజియం ఏర్పాటు కానుందన్నారు. ఈ సంపదను వ్యక్తిగతంగా దాచుకోకుండా, ప్రపంచానికి అందుబాటులో ఉంచాలన్నది ఆయన ఆకాంక్ష అని తెలిపారు. . సీనియర్  జర్నలిస్ట్  రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. జయధీర్  తిరుమలరావు సేకరించిన కళాఖండాలు ఆదివాసీ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే అమూల్య సంపద అని కొనియాడారు.