ముంబై: అణు పరిశోధనా విభాగమైన భాభా అణు పరిశోధనా కేంద్రం (BARC)లో నకిలీ శాస్త్రవేత్త అరెస్టు తర్వాత కీలకం పరిణామం చోటు చేసుకుంది.. ఫేక్ సైంటిస్టు నుంచి అనుమానాస్పద అణు డేటా ,డజనుకు పైగా మ్యాప్‌లను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలలో ఏదైనా సున్నితమైన లేదా గోప్యమైన అణు సమాచారం ఉందో లేదో తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు.
గత వారం వెర్సోవాలో ఫేక్ సైంటిస్టు అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేనిని అరెస్టు చేశారు. అతను వివిధ పేర్లతో శాస్త్రవేత్తగా చలామణి అవుతున్నాడు. అతని నుంచి అనేక నకిలీ పాస్‌పోర్ట్‌లు, ఆధార్ ,పాన్ కార్డులు అలాగే నకిలీ BARC IDలు స్వాధీనం చేసుకున్నారు. అలీ రజా హుస్సేన్, అలెగ్జాండర్ పామర్ ఇలా అనేక రకాల పేర్ల తో అతను నకిలీ సైంటిస్టు గా తిరుగుతున్నాడని విచారణలో తేలింది.
గత కొన్ని నెలలుగా హుస్సేని అనేక అంతర్జాతీయ కాల్స్ చేశాడని తెలుస్తోంది. అతని కాల్ రికార్డులను గుర్తించిన పోలీసులు.. అనుమానిత అణు డేటాను విదేశీ నెట్ వర్క్ లతో పంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేస్తున్నారు.
హుస్సేనే ట్రాక్రికార్డు అంతా మోసపూరితమే..గతంలో నకిలీ సైంటిస్టు అని గుర్తించిన దుబాయ్ ప్రభుత్వం అతడిని బహిష్కరించింది. ఆ తర్వాత అతను నకిలీ పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి దుబాయ్, టెహ్రాన్ ,ఇతర ప్రదేశాలకు ప్రయాణించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
