- ఫస్ట్ ఫేజ్‌పంచాయతీ ఫలితాలే ఇందుకు నిదర్శనం: రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఫలితాల్లో గ్రామీణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించారని, అందుకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. గ్రామాల్లో పార్టీ క్రమేణా బలపడుతోందని, పల్లె జనం బీజేపీ వైపు చూస్తున్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. ప్రధాని మోదీ మోదీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి కట్టుబడి ఉందని, కేంద్రం చేస్తున్న పనులే తమను గెలిపిస్తున్నాయని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గ్రామాల్లో కొత్త రోడ్లు, వీధి దీపాలు, శ్వశానవాటికలు, రైతు వేదికలు కేంద్రం చొరవతోనే వచ్చాయన్నారు. పేదలకు ఉచిత బియ్యం, పక్కా ఇండ్లు, మరుగుదొడ్లు, ఉజ్వలా గ్యాస్ కనెక్షన్లు, మహిళా సంఘాలకు రుణాలు, యువతకు స్వయం ఉపాధి పథకాలు గ్రామీణ జీవన చిత్రాన్నే మార్చేశాయని చెప్పారు. ఈ అభివృద్ధిని చూసే జనం బీజేపీని ఆదరిస్తున్నారని తెలిపారు. అలాగే, రెండో విడత, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ బీజేపీ మరిన్ని స్థానాల్లో గెలుపు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి వెళ్లి, గ్రామాల్లో కేంద్రం చేస్తున్న అభివృద్ధిని వివరించాలని పిలుపునిచ్చారు.

