త్వరలో టీకేఆర్ ఫ్లైఓవర్ పనులు..  ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి

త్వరలో టీకేఆర్ ఫ్లైఓవర్ పనులు..  ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి
  • ఎయిర్ పోర్ట్ వెళ్లే రూట్​లోతీరనున్న ట్రాఫిక్ కష్టాలు
  • 99 రోజుల యాక్షన్ ప్లాన్​తో చాలా మార్పులు వస్తాయని వెల్లడి

హైదరాబాద్ సిటీ, వెలుగు: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.  ప్రత్యేక కార్పొరేషన్​గా​ ఎంఎంసీ ఏర్పడి నెల రోజులు పూర్తయిన సందర్భంగా హెడ్ ఆఫీస్​లో ఆయన ‘వెలుగు’తో బుధవారం ప్రత్యేకంగా ముచ్చటించారు. కార్పొరేషన్ పరిధిలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా టీకేఆర్ (తీగల కృష్ణారెడ్డి) కాలేజీ నుంచి మందమల్లమ్మ జంక్షన్ వరకు నిర్మించనున్న ఫ్లైఓవర్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలిపారు.  

ప్రస్తుతం ఈ రూట్​లో విపరీతమైన రద్దీ కారణంగా విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు, నిత్యం ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఇంజినీరింగ్ విభాగం ఇప్పటికే అన్ని సాంకేతిక అనుమతులు పూర్తి చేసిందని, త్వరలోనే భూమి పూజ చేసి పనులను వేగవంతం చేస్తామని ఆయన వివరించారు. 

త్వరలో కొత్త ఆఫీస్​కు స్థలం ఫైనల్

ఎంఎంసీ పరిధిలో 99 రోజుల యాక్షన్ ప్లాన్​లో భాగంగా శానిటేషన్ సమస్యపై ప్రధానంగా ఫోకస్ పెట్టామని, పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. 100 శాతం ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరగడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా చూస్తున్నామన్నారు. ఈ యాక్షన్ ప్లాన్ తరువాత చాలా వరకు మార్పు వస్తుందన్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరించి రోడ్లపై చెత్త వేయకుండా చేస్తామన్నారు. ఎంఎంసీ కొత్త ఆఫీస్​కు సంబంధించి స్థలాను పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఫైనల్ చేస్తామని చెప్పారు. స్థలం కేటాయింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. 

గ్రౌండ్​లను తీర్చిదిద్దుతున్నం..

ప్రస్తుత రోజుల్లో పిల్లలు సెల్​ఫోన్లకు అడిక్ట్ అయి ఆటపాటలకు దూరమవడంపై కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులు ఫోన్లకు బానిసలు కాకుండా, క్రీడల వైపు మొగ్గు చూపేలా ఎంఎంసీ పరిధిలోని గ్రౌండ్లను తీర్చిదిద్దుతున్నామని  ఆయన తెలిపారు. కేవలం ఆట స్థలాలుగానే కాకుండా, అవి పిల్లల శారీరక, మానసికంగా ఆరోగ్యంగా  ఉండాలని అధికారులను ఆదేశించామన్నారు. ఒకే చోట ఎక్కువ మందికి ఉపయోగపడేలా, ఓపెన్ స్పేస్ ఉన్న మైదానాలను గుర్తించి అక్కడ రన్నింగ్ ట్రాక్లు, జిమ్ పరికరాలు, క్రీడా కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

కాలనీల్లోని పార్కులను కూడా క్రీడలకు అనుకూలంగా మార్చి, స్థానిక యువతకు, పిల్లలకు అందుబాటులోకి తెస్తామని ఆయన వివరించారు. ఎంఎంసీలోని యువత క్రీడల్లో ముందుండేలా చూస్తామన్నారు. ఎంఎంసీని ఒక ఆదర్శవంతమైన కార్పొరేషన్​గా మార్చడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కోరారు.