ఆస్పత్రి నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్

 ఆస్పత్రి నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్

న్యూఢిల్లీ: అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (86) ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అక్టోబర్ 13వ తేదీన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లోని ఎయిమ్స్ కు తరలించిన విషయం తెలిసిందే. జ్వరం, నీరసంతో బాధపడుతుండడంతో డాక్టర్లు చికిత్స అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో మన్మోహన్  సింగ్ డెంగ్యూతో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయింది. 
వైద్యులు చికిత్స ప్రారంభించడంతో రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య క్రమంగా మెరుగుపడింది. ఆయన వ్యక్తిగత డాక్టర్ డాక్టర్ నితీశ్ నాయక్ పర్యవేక్షణలో ఎయిమ్స్ డాక్టర్ల టీం ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించి చికిత్స అందిచగా మన్మోహన్ సింగ్ కోలుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా సోకడంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుని కోలుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన అస్వస్థతకు గురి కావడంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్షుఖ్ మాండవీయ కొద్ది రోజుల క్రితం స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో ఆదివారం డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోయారు.