హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫ్రాన్స్‌కు చెందిన బోర్డో మెట్రోపోల్ ప్రతినిధి బృందం గురువారం జీహెచ్‌ఎంసీ హెడ్డాఫీసులో మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసింది. హైదరాబాద్‌ను ప్రపంచ వారసత్వ నగరంగా తీర్చిదిద్దే అవకాశాలు, ఓల్డ్ సిటీ -అభివృద్ధి పనులపై మేయర్‌తో సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం కమిషనర్ కర్ణన్, అదనపు కమిషనర్ అనురాగ్ జయంతి, ఇతర అధికారులతో సమావేశమై మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుతో పాటు ఓల్డ్ సిటీ వారసత్వ పునరుజ్జీవన పనుల వివరాలు తెలుసుకున్నారు.
అలాగే ఉస్మానియా జనరల్ హాస్పిటల్, పాత ఎంసీహెచ్ ఆఫీస్, సర్దార్ మహల్, ఖుర్షీద్ జా దేవడి, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, కుతుబ్ షాహీ టూంబ్స్‌ను సందర్శించి సంరక్షణ, ల్యాండ్ స్కేప్ అభివృద్ధి పనులను పరిశీలించింది. రాబోయే రోజుల్లో ప్రతిపాదిత వారసత్వ ప్రాజెక్టులను కూడా సందర్శించనున్నట్లు తెలిపింది.
