చర్చల ముచ్చటే లేదు.. 10 ఏళ్లైనా యుద్ధం కొనసాగిస్తం: ట్రంప్‎కు ఇరాన్ కౌంటర్

చర్చల ముచ్చటే లేదు.. 10 ఏళ్లైనా యుద్ధం కొనసాగిస్తం: ట్రంప్‎కు ఇరాన్ కౌంటర్

టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్‎తో యుద్ధం చేస్తోన్న ఇరాన్ తగ్గేదేలేదు అంటోంది. అమెరికాతో చర్చల ముచ్చటే లేదని.. పది ఏండ్లైనా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది ఇరాన్. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ విదేశాంగ విధాన సలహాదారు కమల్ ఖరాజీ మంగళవారం మాట్లాడుతూ.. అమెరికాతో దౌత్యానికి అవకాశమే లేదని కుండబద్దలు కొట్టారు.

ఇరాన్ సైన్యం సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా స్పష్టం చేశారు. ఇరాన్ వార్ ఎండ్ స్టేజ్‎కు వచ్చిందన్న ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. యుద్ధం వాళ్లు మొదలుపెట్టారు.. ముగింపు ఇరాన్ చేతుల్లో ఉందని పేర్కొన్నారు. 

ఇరాన్ భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించేది తమ దేశ సాయుధ బలగాలని.. అమెరికా సైనికులు యుద్ధాన్ని ముగించలేరని కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ శక్తికి మించి పోరాడుతోందని.. కానీ యుద్ధంలో అధిపత్యం సాధించామంటూ ట్రంప్ అబద్ధాలు చెబుతున్నాడని విమర్శించారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు అంతే ధీటుగా ప్రతి దాడులు చేస్తామని తేల్చి చెప్పారు. 

 అసలు ట్రంప్ ఏమన్నారంటే..?

ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగియవచ్చని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధం ముగింపుకు చేరుకుందని తెలిపారు. ఇరాన్‎కు నావికాదళం లేదు, కమ్యూనికేషన్లు లేవు, వైమానిక దళం లేదన్నారు. గత అంచనాలకు నాలుగైదు వారాల ముందే వార్ ఎండ్ అవుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అయితే.. ప్రపంచ చమురు సరఫరాకు ఇరాన్ అంతరాయం కలిగిస్తే దాడులు భయంకరంగా ఉంటాయని హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధిలో చమురు రవాణాను ఆపడానికి ఇరాన్ ఏదైనా చేస్తే.. ఇప్పటికంటే 20 రెట్లు ఎక్కువ శక్తితో దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.