
హైదరాబాద్, వెలుగు: తమది ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి అన్నారు. ఈ వర్గాలకు ఎలాంటి సమస్య ఎదురైనా వాటిని పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ముందుకె ళ్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు చిన్నారెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య సమావేశమయ్యారు.
మంగళవారం ప్రజా భవన్‌లో జరిగిన ఈ భేటీలో కమిటీ సభ్యులు సమస్యలపై చర్చించా రు. కిందిస్థాయి నుంచి ఉన్నత ఉద్యోగి, అధికారి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి అందిన పలు వినతి పత్రాలను త్రిసభ్య కమిటీ సభ్యులు పరిశీలించారు. ఆయా సంఘాల నుంచి అందిన వినతులపై చర్చించి నివేదికను రూపొందించాలని కమిటీ నిర్ణయించింది.