- హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి ఆంధ్రాలో విక్రయం
- ముగ్గురు అరెస్ట్.. 23 కార్లు స్వాధీనం
మెహిదీపట్నం, వెలుగు: నగరంలోని పలు ప్రాంతాల్లో కార్లను అద్దెకు తీసుకొని ఏపీలో వాటిని విక్రయిస్తున్న ముఠాను లంగర్‌హౌస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 23 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను లంగర్ హౌస్ లోని సుగుణ గార్డెన్ లో సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ మీడియాకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడ పెద్దకాకాని ప్రాంతానికి చెందిన అజయ్ ధీర్ పలు ట్రావెల్స్ వద్ద కార్లను అద్దెకు తీసుకున్నాడు. ఫోన్ చేసి తన మనుషులను పంపిస్తున్నానని చెప్పి కార్లను బుక్ చేసుకున్నాడు. ఇలా పలువురు ఆయనకు కార్లు అద్దెకు ఇచ్చారు.
అయితే, ఈ కార్లను అజయ్ధీర్ గ్యాంగ్ ఏపీకి తీసుకెళ్లి అమ్ముకుంటోంది. రెంట్‌కు ఇచ్చిన కార్లను తిరిగి ఇవ్వకపోవడంతో ఇటీవల లంగర్‌హౌస్ కాలనీకి చెందిన ట్రావెల్స్ యజమాని హబీద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయవాడకు వెళ్లి అజయ్ ధీర్ కు చెందిన వ్యక్తులు హాజ్రాత్ అలీ, భాషా, తోట శ్రీనివాస్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు. వారు విక్రయించిన 23 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఏడాది కాలంగా ఈ కార్ల అద్దె దందా నడుస్తుందని డీసీపీ పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ వెంకటరాముల, డీఐ సత్యనారాయణ, ఎస్సై భానుప్రకాశ్, క్రైమ్ టీమ్‌ను డీసీపీ అభినందించారు.
