అక్కడ సక్సెస్ అయితే.. హైదరాబాద్ సిటీ అంతా క్యూఆర్ కోడ్ తో చెత్త సేకరణ

అక్కడ సక్సెస్ అయితే..  హైదరాబాద్ సిటీ అంతా క్యూఆర్ కోడ్ తో చెత్త సేకరణ
  • పారిశుద్ధ్య సమస్యలపై ఫిర్యాదులు  వస్తే వెంటనే స్పందించాలి 
  • ఎస్ఎన్డీపీ, హెచ్​సిటీ  ప్రాజెక్టులకు నిధుల కొరత లేదు 
  • జీహెచ్ఎంసీ కమిషనర్​ ఆర్వీ కర్ణన్

హైదరాబాద్ సిటీ, వెలుగు:  పైలట్​ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న క్యూ ఆర్ కోడ్ తో డోర్ -టు- డోర్ చెత్త సేకరణ సక్సెస్​ అయితే, సిటీ అంతా విస్తరింపజేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్ జోన్ అత్తా పూర్ సర్కిల్ పరిధి హైదర్ గూడలోని నలందనగర్​లో క్యూ ఆర్ కోడ్ ఆధారిత డోర్ -టు -డోర్ చెత్త సేకరణ పైలట్ ప్రాజెక్టు అమలును జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అడిషనల్​కమిషనర్ రవి కిరణ్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యతో కలిసి ఆయన పరిశీలించారు.

తర్వాత స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ తీరును తనిఖీ చేశారు. స్వచ్ఛ ఆటో కార్మికులకు చెత్త ఇవ్వని ఇండ్లు ఉంటే గుర్తించి తప్పనిసరిగా చెత్త అందించేలా అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరు, పనితీరు, సూపర్​వైజర్ల పర్యవేక్షణలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. పారిశుద్ధ్య సమస్యలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలని అధికారులకు ఆదేశించారు. విలీనం కాకముందే అత్తాపూర్​సర్కిల్​తో పాటు వనస్థలిపురం, కైత్లాపూర్ పరిధిలో క్యూ ఆర్​కోడ్​తో డోర్​టు డోర్​ చెత్త సేకరణను పైలట్​ప్రాజెక్టు కింద ప్రారంభించారు. ఇక్కడి ఫలితాలు సానుకూలంగా ఉంటే జీహెచ్ఎంసీ వ్యాప్తంగా దీనిని అమలు చేసేందుకు అధికారులు కార్యచరణ సిద్ధం  చేస్తున్నారు.

ఆ బ్రిడ్జి, ఫ్లైఓవర్ జూన్ 2  లోపు పూర్తి కావాలి..

హెచ్ సిటీ, ఎస్ఆర్ డీపీ పనుల్లో వేగం పెంచాలని కమిషనర్ కర్ణన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌‌లో మంగళవారం జోన్లలో చేపడుతున్న ఎస్ఎన్ డీపీ, హెచ్ సిటీ  పనుల పురోగతిపై జోనల్ కమిషనర్లు, ప్రాజెక్ట్స్ ఇంజినీర్లు, ప్లానింగ్, ఇరిగేషన్, భూ సేకరణ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు పవర్​పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక్కో  ప్రాజెక్ట్ పురోగతిని కమిషనర్ కు వివరించారు.   కమిషనర్ మాట్లాడుతూ ప్రాజెక్టులకు నిధుల కొరత లేదన్నారు. యుటిలిటీ షిఫ్టింగ్, పెండింగ్ భూ సేకరణ తొందరగా పూర్తి చేయాలన్నారు.

ఇష్యూస్ ఏమైనా ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉంటే తనకు చెప్తే వెంటనే క్లియర్ చేయిస్తానన్నారు. ముసారాంబాగ్ హై లెవెల్ బ్రిడ్జి, నల్గొండ ఎక్స్ రోడ్డు ఫ్లై ఓవర్ పనులను జూన్ 2  లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేబీఆర్ పార్క్ ప్రాజెక్ట్ పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. జోనల్ కమిషనర్ లు అనురాగ్ జయంతి , జి ముకుందారెడ్డి, చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి పాల్గొన్నారు.

అవసరమైతే కొత్త ఆటోలు కొనండి 

బోడుప్పల్ సర్కిల్ లోని పలు ప్రాంతాల్లో ఇంటింటి చెత్త సేకరణను మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ ఆటోలు తప్పనిసరిగా డోర్ టు డోర్ చెత్త సేకరించాలని, అవసరమైతే  ఆటోల సంఖ్యను పెంచాలన్నారు. ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా, ఆటోలకు మాత్రమే అప్పగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ను తొలగించి, అక్కడ మళ్లీ చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంట డిప్యూటీ కమిషనర్ ఎ శైలజ ఉన్నారు.