- ఐఐటీ మద్రాస్‌తో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చర్చలు
- ఇంజినీరింగ్, ఆర్ట్స్, కామర్స్ అన్నింటిలోనూ ఏఐ పాఠాలు
- వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే అమలు
హైదరాబాద్, వెలుగు: మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టు మన స్టూడెంట్లను అప్‌డేట్ చేసేందుకు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని కాలేజీల్లో ఇకపై లెక్చరర్లతోనే కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తోనూ పాఠాలు చెప్పించేందుకు రెడీ అవుతోంది. కొత్త కోర్సుల్లో ఏఐ ట్యూటర్ల ద్వారా క్లాసులు నిర్వహించాలని భావిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా యాప్ ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో డిగ్రీ, పీజీ కోర్సులన్నీ సంప్రదాయ సిలబస్ లోనే కొనసాగుతున్నాయి. కొన్ని సబ్జెక్టులను అప్‌డేట్ చేస్తున్నా.. ఆశించిన ఫలితాలు రావడం లేదని విద్యా శాఖ భావిస్తోంది. దీంతో విద్యార్థులకు టెక్నాలజీని మరింత చేరువ చేసేందుకు టీజీసీహెచ్ఈ చర్యలు ప్రారంభించింది. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పుల దృష్ట్యా, కొత్తగా ప్రవేశపెడుతున్న కోర్సులకు సంబంధించిన బోధనలో ఏఐని భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించే యాప్ ద్వారా విద్యార్థులకు క్లాసులు చెప్పించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. విద్యార్థులకు సబ్జెక్టుపరంగా సందేహాలను నివృత్తి చేయడంతో పాటు, క్లిష్టమైన అంశాలను సులభంగా వివరించేలా ఏఐ ట్యూటర్లను తీర్చిదిద్దనున్నారు.
అన్ని కోర్సుల్లోనూ ఏఐ
ఇప్పటిదాకా ఇంజినీరింగ్ చదివే వాళ్లకే ఏఐ అనే విధానానికి స్వస్తి పలకనున్నది. ఏఐ అక్రాస్ కరికులం పేరుతో డిగ్రీ, పీజీ చదివే ఆర్ట్స్, కామర్స్, సైన్స్, అగ్రికల్చర్, లా స్టూడెంట్లకు కూడా ఏఐ సాయంతో పాఠాలు చెప్పనున్నారు. ప్రతి కోర్సులోనూ ఏఐకి సంబంధించిన చాప్టర్లను చేరుస్తారు. మన వర్సిటీలను కేవలం పాఠాలు చెప్పే సెంటర్లుగానే కాకుండా.. వ్యవసాయం, హెల్త్, వాతావరణం వంటి సమస్యలకు పరిష్కారం చూపే ఇన్నొవేషన్ హబ్‌లుగా మారాలన్నది కౌన్సిల్ ఆలోచన. దీనికోసం వర్సిటీల్లోనే ప్రత్యేకంగా ఏఐ రీసెర్చ్ పార్కులు, ల్యాబ్‌లు ఏర్పాటు చేసి స్టూడెంట్లను ప్రాక్టికల్ నాలెడ్జ్ వైపు మళ్లించేలా యోచిస్తున్నారు.
రూరల్ స్టూడెంట్లకు మేలు
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఏఐ ట్యూటర్లు పెద్ద దిక్కు కానున్నాయి. క్లాసులో పాఠం అర్థం కాకపోయినా, డౌట్స్ ఉన్నా ప్రత్యేక యాప్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. స్టూడెంట్ ఏ సబ్జెక్టులో వీక్‌గా ఉన్నాడో కనిపెట్టి, వాళ్లకు అర్థమయ్యేలా పర్సనల్ ట్యూటర్ లాగా ఈ ఏఐ యాప్ పాఠాలు వివరిస్తుంది.
విజన్ 2047లో భాగంగానే
విజన్ 2047లో భాగంగా తెలంగాణను నాలెడ్జ్ ఎకానమీలో టాప్‌గా నిలబెట్టాలన్న లక్ష్యంతో ఏఐ ట్యూటర్ల అంశాన్ని పరిశీలిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతోనూ ప్రిలిమినరీ చర్చలు జరిపాం. సర్కారు ఆదేశాలకు అనుగుణంగా ముందుకు పోతాం. - ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, టీజీసీహెచ్ఈ చైర్మన్
