హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న అధికారులకు రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లకు (ఎసీటీఓ) గెజిటెడ్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వీరు డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్నారు.
చాలా కాలంగా తమకు గెజిటెడ్ హోదా కల్పించాలని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వివిధ ఉద్యోగ సంఘాల విన్నపాలు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ పంపిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ కార్యదర్శి ఎం. రఘునందన్ రావు జీవో ఇచ్చారు.
దీని ప్రకారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు (ప్రస్తుతం డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్లు (డీఎస్‌టీఓ)) ఇకపై గెజిటెడ్ హోదాను కలిగి ఉంటారు.
