యాదగిరిగుట్టలో శివరాత్రి ఉత్సవాలు షురూ

యాదగిరిగుట్టలో శివరాత్రి ఉత్సవాలు షురూ

యాదగిరిగుట్ట, వెలుగు:  యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కొండపైన యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం) ఆలయంలో పాంచాహ్నిక దీక్షతో స్మార్త ఆగమ శాస్త్రం పద్ధతిలో స్వస్తివాచనం, విఘ్నేశ్వర పూజ, శుద్ధి పుణ్యాహవచనం, రక్షాబంధనం పూజలతో ఉత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. టెంపుల్ ఈవో భవానీ శంకర్, చైర్మన్ నరసింహమూర్తి స్వస్తివాచన పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో నిత్య పూజలు ముగిసిన అనంతరం.. అంకురారోపణం, సోమకుంభ కలశస్థాపన, దేవతారాధన వంటి పూజలు నిర్వహించారు.

అనంతరం వేదపారాయణీకులు నమక, చమక పారాయణాలు, మంత్రపుష్ప పఠనాలు పఠించారు. 12న మొదలైన ఉత్సవాలు ఈ నెల 17 వరకు ఆరు రోజుల పాటు పాంచాహ్నిక దీక్షతో ఘనంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం ధ్వజారోహణం, భేరిపూజ, దేవతా ఆహ్వానం, అగ్నిప్రతిష్ట నిర్వహించనున్నారు. ఇక 14న ఉదయం రుద్రహవనం, రాత్రికి ఆదిదంపతులైన శివపార్వతుల కల్యాణం, 15న శివరాత్రి సందర్భంగా ఉదయం అభిషేకాలు, రాత్రి లింగోద్భవ కాలమున మహాన్యాసపూర్వకశతరుద్రాభిషేకం, 16న ఉదయం లక్షబిల్వార్చన, రాత్రి రామలింగేశ్వరస్వామి రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. శివరాత్రి ఉత్సవాలకు చివరి రోజైన 17న మహాపూర్ణాహుతి, డోలోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి.