చట్టప్రకారం కేసుల నమోదుకు మార్గదర్శకాలు ఇవ్వండి : హైకోర్టు

చట్టప్రకారం కేసుల నమోదుకు మార్గదర్శకాలు ఇవ్వండి : హైకోర్టు
  • డీజీపీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేసేటప్పుడు చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాలని డీజీపీకి సోమవారం హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఐపీసీ సెక్షన్‌‌‌‌‌‌‌‌ 188 కింద కేసులు నమోదు చేసే సమయంలో సీఆర్‌‌‌‌‌‌‌‌పీసీ సెక్షన్‌‌‌‌‌‌‌‌ 195 ప్రకారం ఉండేలా చూడాలని, ఈ మేరకు సుప్రీంకోర్టు, మద్రాసు హైకోర్టు ఇచ్చిన సూచనలతో ఈ మార్గదర్శకాలు జారీ చేయాలని చెప్పింది. 

కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా ఈ మార్గదర్శకాలు పాటించేలా చూడాలంది. కేసులకు సరైన ఆధారాలు లేనందున పటాన్‌‌‌‌‌‌‌‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే పైలట్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌రెడ్డిపై ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. 

2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పటాన్‌‌‌‌‌‌‌‌చెరువులో ఓ పంక్షన్‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌లో డబ్బు పంపిణీ చేస్తున్నారన్న అభియోగంపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మహిపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ జూకంటి అనిల్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సోమవారం విచారణ చేపట్టారు. ఐపీసీ సెక్షన్‌‌‌‌‌‌‌‌ 188 కింద కేసు నమోదు చేసే సమయంలో సీఆర్‌‌‌‌‌‌‌‌పీసీ సెక్షన్‌‌‌‌‌‌‌‌ 195లోని  
ప్రక్రియను అమలు చేయడం లేదన్నారు. 

ఐపీసీ 188 సెక్షన్‌‌‌‌‌‌‌‌ కింద అభియోగాలకు ఆధారాలు సమర్పించాలన్నారు. ఇవేవీ లేకుండా కోర్టు కూడా అభియోగ పత్రాన్ని విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోరాదన్నారు. దీంతో ఈ కేసును కొనసాగించలేమంటూ కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది. సెక్షన్‌‌‌‌‌‌‌‌ 188 కింద పైలట్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌రెడ్డిపై నమోదైన కేసును కూడా కొట్టివేసింది.