పండగలొస్తున్నయ్..జాగ్రత్త

పండగలొస్తున్నయ్..జాగ్రత్త

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత శనివారం 46,759 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రానున్న ఫెస్టివల్ సీజన్ లో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలంది. వినాయక చవితి, దసరా, దీపావళి పండగల టైమ్ లో జనం గుమిగూడకుండా చూడాలని ఆదేశించింది. అవసరమైతే లోకల్ గా ఆంక్షలు విధించాలని చెప్పింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కొవిడ్ గైడ్ లైన్స్, రూల్స్ ను వచ్చే నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా రాష్ట్రాలు, యూటీలకు లెటర్ రాశారు. కొన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని, ఆయా ప్రాంతాల్లో వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా కట్టడికి ఐదంచెల వ్యూహం అమలు చేయాలని.. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ నిబంధనల అమలుపై ఫోకస్ పెట్టాలని చెప్పారు. 

కేసులు 46 వేలు.. డెత్స్ 509 

దేశంలో కొత్తగా 46,759 కరోనా కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.26 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. వైరస్ తో మరో 509 మంది చనిపోయారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య  4,37,370కి పెరిగిందని తెలిపింది. ఒక్క కేరళలోనే 32,801 కేసులు రికార్డవగా, 179 మంది చనిపోయారు. డైలీ పాజిటివిటీ రేటు 2.66 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 2.19 శాతంగా, రికవరీ రేటు 97.56 శాతంగా, డెత్ రేటు 1.34 శాతంగా నమోదైందని వివరించింది. కరోనా నుంచి ఇప్పటి వరకు 3.18 కోట్ల మంది కోలుకున్నారంది.

స్కూళ్లను తెరవండి..

దేశంలో స్కూళ్లను వెంటనే రీఓపెన్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 56 మంది విద్యావేత్తలు, డాక్టర్లు ఓపెన్ లెటర్ చేశారు. బడులను ప్రారంభించడానికి ముందే పిల్లలందరికీ టీకా వేయాలనేది తప్పనిసరేమీ కాదని పేర్కొన్నారు. స్కూళ్లు ఓపెన్ చేస్తే కేసులు పెరుగుతాయని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్నాయని.. కానీ, స్కూళ్లను ఓపెన్ చేయొచ్చని ప్రపంచవ్యాప్తంగా రిపోర్టులు ఉన్నాయని చెప్పారు.