హైదరాబాద్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతను సాకుగా చూపి హైదరాబాద్లో కొన్ని హోటల్స్ కస్టమర్లపై భారం మోపుతున్నాయి. LPG గ్యాస్ కొరతతో పాటు మార్కెట్లో గ్యాస్ ధర ఎక్కువగా ఉండటం వలన ప్రతి వస్తువుపై 10 రూపాయలు పెంచాల్సి వస్తుందని, దయచేసి సహకరించాలని సిటీలో చాలా బ్రాంచులు ఉన్న ఒక ప్రముఖ హోటల్లో నోటీస్ కనిపించింది. గమనిక అని పేర్కొంటూ ఇది తాత్కాలికమని సదరు హోటల్ చెప్పుకొచ్చింది. సదరు హోటల్ ముందు కట్టెలతో వంట వండుతున్న దృశ్యాలు కనిపించాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 115 రూపాయలు పెంచారు.
మార్చి 7వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంటే.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ నగరంలో 2 వేల 100 రూపాయలకు చేరుకుంది. ఈ క్రమంలోనే హాటళ్లలో ధరలు పెంచేశారు. ఈ ఒక్క హోటల్ మాత్రమే కాదు హైదరాబాద్ సిటీలోని చాలా హోటల్స్లో ఇదే పరిస్థితి ఉంది. బెంగళూరు, చెన్నై నగరాల్లో అయితే చాలా హోటల్స్ కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా మూతబడ్డాయి.
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని హోటల్స్ అయితే.. నిబంధనలను అతిక్రమించి డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ సిలిండర్ల స్థానంలో వాడుతున్నాయి. సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో చాలా హోటల్స్లో ఇలా డొమెస్టిక్ సిలిండర్లు వాడుతూ హోటల్స్ యాజమాన్యాలు దొరికిపోయాయి. ఇలాంటి హోటళ్లపై అధికారులు కేసు నమోదు చేశారు.
ఇడ్లీ నుంచి పరోటా వరకు.. అన్నింటిపైనా 10 రూపాయలు పెంచేసిన హోటళ్లు
ఇడ్లీ, వడ, దోశ, బోండా, ఉప్మా, పూరీ, పరోటా, చపాతీ, పొంగల్.. ఇలా టిఫిన్ ఏదైనా సరే.. చిన్నా పెద్ద ఐటమ్ అని తేడా లేదు.. స్టాండర్డ్ గా ఐటమ్ పై 10 రూపాయల ధర పెంచేశాయి హోటళ్లు.. గతంలో ప్లేట్ ఇడ్లీ 40 రూపాయలు ఉంటే.. ఇప్పుడు ప్లేట్ ఇడ్లీ 50 రూపాయలు అయ్యింది.
మొన్నటి వరకు ప్లెయిన్ దోశ 60 రూపాయలు ఉంటే.. ఇప్పుడు 70 రూపాయలు. సాంబార్ ఇడ్లీ 50 నుంచి 60 రూపాయలు అయ్యింది. స్పెషల్ దోశ 60 నుంచి 70 రూపాయలు అయ్యింది. పరాటా, చపాతీ, పొంగల్.. ఐటమ్ ఏదైనా 10 రూపాయలు పెంచేసిట్లు హోటళ్లు బోర్డులు పెట్టాయి.
