మెట్రో సెక్యూరిటీ వింగ్లో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్లు

మెట్రో సెక్యూరిటీ వింగ్లో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్లు
  • విధుల్లో చేరిన 20 మంది 
  • లేడీస్ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై స్పెషల్ ఫోకస్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్  మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత, ముఖ్యంగా మహిళల సేఫ్టీని మరింత పటిష్టం చేసేందుకు సెక్యూరిటీ విభాగంలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెండర్లకు అవకాశం కల్పించింది. ట్రైనింగ్  పూర్తి చేసుకున్న 20 మంది ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెండర్  సెక్యూరిటీ సిబ్బంది సోమవారం నుంచి విధుల్లో చేరారు. అన్ని వర్గాలకు అండగా నిలవాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో సంస్థ తెలిపింది. ఇండక్షన్  సెక్యూరిటీ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసుకున్న ఈ 20 మంది సోమవారం నుంచి ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లు, రైళ్లలో తమ సేవలు అందించనున్నారు. ఇది మెట్రో చరిత్రలోనే ఒక మైలురాయి అని అధికారులు పేర్కొన్నారు.  

ఉద్యోగ కల్పనే కాదు... సామాజిక మార్పు కూడా 

హైదరాబాద్  సిటీలో రోజుకు దాదాపు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. వారిలో 30 శాతం మంది మహిళలే ఉన్నారు. మహిళా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ప్రయాణించేలా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెండర్లను సెక్యూరిటీ విధుల్లోకి తీసుకున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ఇది ఉద్యోగ కల్పన మాత్రమే కాదని, సామాజిక మార్పులో భాగమని స్పష్టం చేశారు.

ట్రాన్స్ జెండర్ల డ్యూటీలు ఇవే..

లేడీస్ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లలో, స్టేషన్లలోని జనరల్  ఏరియాల్లో మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూడడం, ప్రయాణికులకు దారి చూపించడం, సమాచారం ఇవ్వడం, బ్యాగేజీ స్కానర్ల వద్ద ప్రయాణికుల కదలికలను పర్యవేక్షించడం, స్టేషన్  ఆవరణలో, కాంకోర్స్ లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచడం.