హైదరాబాద్ ORR చుట్టూ ఆర్టీసీ బస్సులు.. ఎగ్జిట్ పాయింట్స్ వరకూ నడిపే యోచన

హైదరాబాద్ ORR చుట్టూ  ఆర్టీసీ బస్సులు.. ఎగ్జిట్ పాయింట్స్ వరకూ నడిపే యోచన
  • ఇప్పటికే ఔటర్ ​పరిసర ప్రజల నుంచి డిమాండ్
  • ఫీజుబులిటీ స్టడీ పూర్తి.. త్వరలో నిర్ణయం
  • బస్సుల సంఖ్య పెరిగితే పర్యాటక ప్రాంతాలకు తాకిడి

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఔటర్ రింగ్​ రోడ్​ ​చుట్టూ బస్సు సర్వీసులను పెంచే విషయంపై గ్రేటర్​ ఆర్టీసీ అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఔటర్​ పరిసర ప్రాంతాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్​ రుగుతోంది. అయినప్పటికీ ఆర్టీసీ అధికారులు లాభాలు వచ్చే రూట్లలోనే ఎక్కువ బస్సులు నడుపుతున్నారని, కొత్త కాలనీల వైపు చూడడం లేదని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఔటర్​రింగ్​రోడ్​పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న కాలనీలు, బస్తీలపై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ఫీజుబులిటీ స్టడీ నిర్వహించారు. ప్రస్తుతం ఔటర్ సర్వీస్ రోడ్డుపై శంషాబాద్​నుంచి గచ్చిబౌలి వరకూ 315 నంబర్ బస్​సర్వీసును నడుపుతున్నారు. దీనికి ఆయా ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, సాధారణ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. 

158 కి.మీ పొడవున్న ఓఆర్ఆర్​కు రెండు వైపుల 25 ఎగ్జిట్​పాయింట్స్ ఉన్నాయి. శంషాబాద్​– గచ్చిబౌలి మాదిరిగానే ఓఆర్ఆర్​ పై ఇతర మార్గాల్లోనూ ఆర్టీసీ సర్వీసులను నడిపితే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని అధికారులు అంటున్నారు. ఈ విషయంపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. 

అన్ని ఎగ్జిట్​ పాయింట్లకు అనుసంధానం

ప్రస్తుతం ఓఆర్ఆర్​పై నియో పోలీస్, కొల్లూరు, పెద్ద గోల్కొండ, నానక్ రామ్​గూడ, తుక్కుగూడ, నార్సింగి, కీసర, శామీర్​పేట, శంషాబాద్, తుక్కుగూడ, టీఎస్పీఏ, పెద్ద​అంబర్​పేట,  మేడ్చల్, దుండిగల్, మల్లంపేట వంటి 25 ప్రాంతాల్లో ఎగ్జిట్​పాయింట్లు ఉన్నాయి. ఈ ఎగ్జిట్​పాయింట్ల నుంచి పరిసర ప్రాంతాలకు వెళ్లడానికి అనుగుణంగా బస్సులను అనుసంధానం చేస్తే అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఓఆర్ఆర్​నుంచి దాదాపు 20 నుంచి 25 కి.మీ. దూరంలో కాలనీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో  విజ్ఞప్తులు వస్తున్నట్టు కూడా అధికారులు చెబుతున్నారు. వారి విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని బస్సులను నడిపే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

ప్రజా రవాణాను విస్తరిస్తే.. ట్రాఫిక్​ సమస్యలకు చెక్

వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను విస్తరిస్తే ట్రాఫిక్ ​సమస్యలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. ఓఆర్ఆర్ ​సర్వీస్​పై  బస్సులను  నడిపితే పరిసర ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీలకు వెళ్లడానికి 20 నుంచి 30 నిమిషాలే పడుతుందని అంటున్నారు. బస్సుల సంఖ్య పెరిగితే ఆయా ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించే వారి సంఖ్య కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. వ్యక్తిగత వాహనాలు తగ్గి ప్రజా రవాణా మరింత విస్తరించే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్​పరిధిలో ఆర్టీసీ 2800 బస్సులు నడుపుతుండగా, ఇందులో దాదాపు 450 ఎలక్ట్రిక్​ బస్సులు ఉన్నాయి. త్వరలో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టనున్నారు. వీటిని ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో నడపాలని ఆయాప్రాంతాల వాసులు కోరుతున్నారు.