వరంగల్ లో పట్టపగలే ఇసుక దందా

వరంగల్ లో పట్టపగలే ఇసుక దందా
  • అక్రమ కరెంట్ కనెక్షన్లతో ఫిల్టరింగ్

హసన్ పర్తి, వెలుగు: హసన్ పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. కొంతమంది మూడు గ్రూపులుగా విడిపోయి, ఎస్సారెస్పీ, ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో రేయింబవళ్లు ఇసుక తరలిస్తున్నారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఊర్లు దాటించి, సిటీకి తరలిస్తున్నారు. ముందుగా కార్లు, బైకులు తోలి, పోలీసులు ఎవరూ లేకుంటే ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. టన్నుకు రూ.1500చొప్పున సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇసుకను ఫిల్టర్ చేసే సమయంలో కరెంట్ పోల్స్​కు అక్రమ కనెక్షన్లు తీసుకుంటున్నారు. అటు ఇసుకను.. ఇటు కరెంట్ ను నిలువు దోపిడీ చేస్తున్నారు.
ఆకేరు వాగు నుంచి..
నెల్లికుదురు, వెలుగు: నెల్లికుదురు మండలంలోని ఆకేరు వాగు నుంచి కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. మండలంలోని మేచరాజుపల్లి, ఎర్రబెల్లిగూడెం, నెల్లికుదురు, బ్రాహ్మణకొత్తపల్లి, మదనతుర్తి, మునిగలవీడు ఆకేరు వాగు పరివాహక గ్రామాలు ఉండగా.. కొందరు వ్యక్తులు ఆ ఊర్ల మీద పడి రోజుకు 20 నుంచి 50 ట్రిప్పులు తరలిస్తున్నారు. ట్రాక్టర్ల సౌండ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామల ప్రజలు వాపోతున్నారు. కాగా స్థానిక పోలీసులకు సైతం మామూళ్లు సమర్పించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇసుక డంపులపై దాడులు
నర్సింహులపేట, వెలుగు: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం గోల్ బోడ్క తండా, బంజార పత్నీ తండాలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులపై పోలీస్, రెవెన్యూ ఆఫీసర్లు దాడులు నిర్వహించారు. బంజార పత్నీ తండాకు చెందిన గుగులోత్ హరి తన ఇంటి నిర్మాణం కోసం రూ.70వేల విలువైన ఇసుకను స్టాక్ చేసుకోగా.. ఎలాంటి పర్మిషన్ లేదని ఆఫీసర్లు ఇసుకను తీసుకెళ్లారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. బాధితుడు వాహనాన్ని అడ్డుకుని, కాళ్ల మీద పడ్డా ఆఫీసర్లు కనుకరించలేదు. సూసైడ్ చేసుకుంటానని బెదిరించడంతో కొంత ఇసుకను వదిలేసి వెళ్లారు. కాగా,మండలంలో వేల ట్రిప్పులు అక్రమంగా తీసుకెళ్తున్నా.. పేదలపైనే ఆఫీసర్లు ప్రతాపం చూపిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.