తెలంగాణలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఉదయం సూర్యుడు నిప్పులు చెరుగుతుంటే.. సాయంత్రానికి వరుణుడు పలకరిస్తున్నాడు. మరోవైపు అకాల వర్షాలతో రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు.. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరి కొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ,మెదక్ జిల్లాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.
