- రాజ్ హ్యాట్రిక్ గోల్స్
- ఆసియా చాంపియన్స్ ట్రోఫీ
హలెన్‌బర్గ్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా హాకీ టీమ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. యంగ్ స్ట్రయికర్ రాజ్ కుమార్ పాల్ (3, 25, 33వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో.. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇండియా 8–1తో మలేసియాను చిత్తు చేసి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రాజ్ కుమార్‌తో పాటు అరైజిత్ సింగ్ హుండాల్ (6, 39వ ని), జుగ్‌రాజ్ సింగ్ (7వ ని), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (22వ ని), ఉత్తమ్ సింగ్ (40వ ని) ఇండియాకు గోల్స్ అందించారు. మలేసియా తరఫున అకీమ్‌ల్లా అనూర్ (34వ ని) ఏకైక గోల్ సాధించాడు. వరుసగా మూడు విజయాలతో 9 పాయింట్లు సాధించిన ఇండియా పట్టికలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇండియా 3–0తో చైనాపై, 5–1తో జపాన్‌పై గెలిచింది. గురువారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇండియా.. కొరియాతో తలపడుతుంది.
ఆరంభం నుంచే దూకుడు..
గత ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత తొలిసారి మలేసియాతో తలపడ్డ ఇండియా ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో ఆకట్టుకుంది. ఫార్వర్డ్స్, డిఫెండర్లు సమన్వయంతో కదులుతూ మలేసియాను కట్టడి చేశారు. ముఖ్యంగా స్ట్రయికర్లు తమ ఫామ్ కొనసాగించారు. తొలి క్వార్టర్‌లో విపరీతమైన దాడులు చేసిన ఇండియా వరుస నిమిషాల్లో ఫలితాన్ని రాబట్టింది. అద్భుతమైన ఫుట్, స్టిక్ వర్క్ చూపెట్టిన రాజ్ కుమార్ ప్రత్యర్థి సర్కిల్‌లోకి పదేపదే దూసుకెళ్లి గోల్స్ చేసే అవకాశాలను సృష్టించాడు. అరైజిత్ సింగ్, హర్మన్ అండగా నిలిచారు. జుగ్‌రాజ్ తన పెనాల్టీ కార్నర్ నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. తొలి క్వార్టర్ ముగిసేసరికి ఇండియా 3–0 లీడ్‌లో నిలిచింది. రెండో క్వార్టర్‌లో మలేసియా ఎదురుదాడులకు దిగింది. కానీ బలమైన ఇండియా డిఫెన్స్ ముందు ఇది తేలిపోయింది. 22వ నిమిషంలో హర్మన్ వరుసగా రెండు పెనాల్టీలు సాధించగా ఒక్కటి సక్సెస్ అయ్యింది. ఫస్టాఫ్ ముగిసేసరికి ఇండియా 5–0 లీడ్‌లో నిలిచింది. గోల్ చేసేందుకు రెండో భాగంలో మలేసియా చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. దీన్ని ఆసరాగా చేసుకుని అరైజిత్, ఉత్తమ్ చకచకా గోల్స్ కొట్టి లీడ్‌ను మరింత పెంచారు. మరో మ్యాచ్‌లో పాకిస్తాన్ 2–1తో జపాన్‌ను ఓడించింది. దీంతో సెమీస్‌కు చేరే అవకాశాలను మెరుగుపర్చుకుంది.