
మంచిర్యాల: భారతీయ శాస్త్రీయ నృత్య కళలను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత నృత్య గురువులపై ఉందన్నారు రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. శనివారం (సెప్టెంబర్ 13) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు జయ జయహే తెలంగాణ అధికార గీతంపై కూచిపూడి బృంద నృత్య ప్రదర్శన చేశారు.
ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు మంత్రి వివేక్. ఈ సందర్భంగా మంత్రి వివేక్‌కు ఘన స్వాగతం పలికి శాలువతో సత్కరించారు స్నేహ ఫౌండేషన్ చైర్మన్ కేవీ ప్రతాప్, కూచిపూడి నాట్య గురువు డాక్టర్ చిదానంద కుమారి. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి వెంకటస్వామి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక కాలంలో శాస్త్రీయ కళలు మరుగునపడకుండా అనునిత్యం శిక్షణతో ముందుకు వస్తున్న నృత్య గురువులందరికి అభినందనలు తెలిపారు.
కూచిపూడి నృత్యం శారీరక మానసిక వికాసానికి దోహదపడటంతో పాటు మైండ్ రిలీఫ్‌గా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా గుర్తించారన్నారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు, చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే గీతం జయ జయహే తెలంగాణ అని అన్నారు.