- రెండు బైక్‌లు, కారును ఢీకొట్టిన ఇన్నోవా
- ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని హైదరాబాద్–బీజాపూర్ హైవేపై ఓ ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. ఓవర్‌స్పీడ్‌తో రెండు బైక్‌లు, మరో కారును ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. రంగాపూర్ నుంచి పరిగి వైపు వస్తున్న ఇన్నోవా కారు, పరిగి మండలంలోని రంగాపూర్ రైతు వేదిక సమీపంలో ఓ లూనాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాదారం గ్రామానికి చెందిన నర్సింహులు(49) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అనంతరం రాంగ్ రూట్‌లో దూసుకెళ్లిన కారు మరో బైక్‌ను ఢీకొట్టడంతో దాదాపూర్‌కు చెందిన రాజు, మోత్కూర్‌కు చెందిన ప్రియాంక, వైష్ణవి గాయపడ్డారు. వీరిలో వైష్ణవి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. అక్కడితో ఆగకుండా మరో కారును కూడా ఢీకొట్టి పరారవుతుండగా, పరిగి యూనియన్ బ్యాంక్ సమీపంలో స్థానికులు వెంబడించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
