- ఒకసారి అమర్చితే 15 ఏండ్లపాటు సేవలు
- పరికరం ప్రత్యేకతలు వివరించిన నిర్వాహకులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: వాహన కాలుష్యానికి ‘పొల్యూషన్ రెడ్యూసర్ కంట్రోల్ డివైస్’ అద్భుత పరిష్కారం చూపుతుందని దాని సృష్టికర్త మార్గాని రామారావు తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ పరికరం ప్రత్యేకతలను ఆయన వివరించారు. వైజాగ్ నేవల్ డాక్యార్ట్లో వెహికల్ సూపర్వైజర్గా పనిచేసిన అనుభవంతో ఈ పరికరాన్ని రూపొందించినట్లు తెలిపారు. వైజాగ్‌లోని మద్దెలపాలెం ఆర్టీసీ బస్సులో మూడేండ్లపాటు ఈ డివైస్‌ను పరీక్షించగా, వాహనం నుంచి వెలువడే పొగ, వాయు కాలుష్యాన్ని 80 శాతం తగ్గించిందన్నారు.
ఈ వినూత్న ప్రొడక్ట్‌పై కేంద్రం నుంచి పేటెంట్ హక్కులు పొందామని, బస్సులు, లారీలకు ఈ పరికరం అమర్చడానికి రూ. 35 వేల నుంచి 40 వేల వరకు, కార్లు, ఆటోలకు రూ. 20 వేల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ఒకసారి బిగిస్తే 15 ఏండ్ల పాటు పనిచేస్తుందని, ప్రతి మూడు నుంచి నాలుగు వేల కిలోమీటర్ల తర్వాత చేసే మెయింటెనెన్స్ కోసం కేవలం రూ. 60 మాత్రమే ఖర్చవుతుందని వివరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఈ డివైస్ పనితీరుపై వివరిస్తామన్నారు.
