సోనియాను కలిసిన శశిథరూర్

సోనియాను కలిసిన శశిథరూర్
  • ఎవరైనా పోటీ చేయొచ్చన్న సోనియా గాంధీ

ఎన్నికల షెడ్యూల్​ ఇదీ.. 

  • ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ
  • అక్టోబర్​ 17న పోలింగ్
  • అక్టోబర్​ 19న కౌంటింగ్, రిజల్ట్​ ప్రకటన

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ పార్టీ ప్రెసిడెంట్​పదవికి సీనియర్​ లీడర్​ శశిథరూర్​ పోటీ పడనున్నారు. పార్టీ అంతర్గత ఎన్నికల బరిలో నిలబడేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు పార్టీ చీఫ్​ సోనియా గాంధీ ఆమోదం కూడా లభించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈమేరకు సోమవారం పార్టీ లీడర్లు దీపేంద్ర హుడా, జై ప్రకాశ్​ అగర్వాల్, విజేంద్ర సింగ్​లతో కలిసి శశిథరూర్​ ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. పార్టీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన సోనియాకు వెల్లడించినట్లు సమాచారం. కొత్త ప్రెసిడెంట్​ ఎన్నికలు షెడ్యూల్​ ప్రకారమే జరుగుతాయని, ఎన్నికల్లో పార్టీ నేతలు ఎవరైనా పోటీ చేయొచ్చని సోనియా స్పష్టంచేసినట్లు తెలిసింది. పార్టీ ప్రెసిడెంట్​ ఎన్నిక పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతుందని పార్టీ ఎంపీ జైరాం రమేశ్​ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో పార్టీ నేతలు ఎవరైనా పోటీ చేయొచ్చని చెప్పారు. కాగా, కాంగ్రెస్​ పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం నుంచి తప్పించాలని, కొత్త ప్రెసిడెంట్​ను ఎన్నుకోవాలని ఆ పార్టీలోని అసంతృప్త నేతలు (జీ23 గ్రూప్) చాలాకాలంగా డిమాండ్​ చేస్తున్నారు. ఆ గ్రూప్​లో శశిథరూర్​ లేనప్పటికీ కొత్త ప్రెసిడెంట్​ను ఎన్నుకోవాలని ఆయన కూడా డిమాండ్​ చేశారు. ప్రెసిడెంట్​ ఎలక్షన్స్​ పారదర్శకంగా నిర్వహించాలంటూ ఏఐసీసీ ఎలక్షన్​ అథారిటీకి శశిథరూర్ ​లెటర్​ కూడా రాశారు. 

మరో అభ్యర్థి గెహ్లాట్..

పార్టీ ప్రెసిడెంట్​ పదవి బరిలో రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​ పేరు వినిపిస్తోంది. గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరున్న గెహ్లాట్​ ఈ ఎన్నికల్లో పోటీచేయడం ఖాయమేనని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 26న కాంగ్రెస్​ చీఫ్​ పదవికి గెహ్లాట్​ నామినేషన్​ దాఖలు చేస్తారని సమాచారం. 

రాహుల్​ పోటీలో లేనట్లే..

పార్టీ అధ్యక్ష పదవి రేసులో రాహుల్​ గాంధీ లేనట్లేనని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పగ్గాలను మళ్లీ చేపట్టాలని పలువురు లీడర్లు ఒత్తిడి తీసుకొచ్చినా రాహుల్​ ఒప్పుకోలేదన్నాయి. పలు రాష్ట్రాల కాంగ్రెస్​ నేతలు తీర్మానాలు కూడా చేసి ఢిల్లీకి పంపారు. రాజస్థాన్, చత్తీస్​గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, హిమాచల్​ ప్రదేశ్, బీహార్​ పీసీసీలు తీర్మానం చేశాయి.