కేటీఆర్ ​మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్

కేటీఆర్ ​మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా  : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్
  •      గతంలో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్​లో చేర్చుకోలేదా ? 
  •     నన్ను విమర్శించినోళ్లు ఆత్మవిమర్శ చేసుకోవాలె 

జగిత్యాల, వెలుగు: నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పని చేస్తున్నాని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాక జగిత్యాల వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పట్టణంలో పర్యటించారు. తర్వాత పద్మనాయక కల్యాణ మండపంలో మాట్లాడుతూ అధికార పార్టీతో కలిసి పని చేయడం వల్ల నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 

అందుకే కాంగ్రెస్​లో చేరినట్టు చెప్పారు. జగిత్యాలలోని నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక సదుపాయాల కోసం సీఎం రూ. 32 కోట్లు కేటాయించారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అని అన్నారు. బీఆర్ఎస్ వేదికపై తనను విమర్శించిన ప్రతి ఒక్కరూ ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడిన మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిని గతంలో బీఆర్ఎస్​లోకి ఆహ్వానించలేదా అని ప్రశ్నించారు. హుందాతనంతో రాజకీయాలు చేయాలన్నారు.