V6 News

కేసీఆర్ ను మరమనిషి అనడం అవివేకం:బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి

కేసీఆర్ ను మరమనిషి అనడం అవివేకం:బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి
  • ఆ వ్యాఖ్యలను కవిత వెనక్కి తీసుకోవాలి
  • బీఆర్​ఎస్​ నేత జీవన్ రెడ్డి 

జగిత్యాల టౌన్, వెలుగు:   మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను 'మరమనిషి' అని విమర్శించడం అత్యంత దారుణమని, ఆ వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే కవిత వెంటనే వెనక్కి తీసుకోవాలని  బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ సాధన కోసం పదవులను త్యాగం చేసిన వ్యక్తి కేసీఆర్ అని, ఆయనకు హృదయం లేకపోతే ప్రత్యేక రాష్ట్రమే వచ్చేది కాదని గుర్తుచేశారు. కొత్త పార్టీ పెట్టిన కవిత, రేవంత్ ప్రభుత్వంపై పోరాడాల్సింది పోయి బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆమె రేవంత్ రెడ్డికి 'బీ -టీమ్'గా వ్యవహరిస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, రాష్ట్రంలో కరువు వస్తే రేవంత్ రెడ్డిదే బాధ్యతని స్పష్టం చేశారు.

కేసీఆర్ హయాంలోనే విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, హైడ్రా, మూసీ నిర్వాసితులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.  కేసీఆర్ హయాంలోనే గురుకులాలు, ఫీజు రీయింబర్స్​మెంట్​, మన ఊరు-మన బడి ద్వారా విద్యను చేరువ చేశారని, 2 లక్షల ఉద్యోగాలన్న కాంగ్రెస్ కేవలం 17 వేలకే పరిమితమైందని విమర్శించారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్యను తగ్గించి చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎస్టీ రిజర్వేషన్లను పెంచిన ఘనత కేసీఆర్‌‌‌‌‌‌‌‌దేనని గుర్తు చేశారు.  ఇకనైనా కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను విమర్శించడం మానుకొని పద్ధతి మార్చుకోవాలని జీవన్ రెడ్డి హితవు పలికారు.