పాపాల భైరవుడు సభకు రావాలి

పాపాల భైరవుడు సభకు రావాలి
  • అసెంబ్లీలో కోమటిరెడ్డి కామెంట్స్
  • తప్పుపట్టిన హరీశ్.. రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ 
  • ఇరిగేషన్​పై నేడు వైట్​పేపర్​ రిలీజ్​

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. శుక్రవారం అసెంబ్లీలో సాగు నీటి పారుదలపై వైట్ పేపర్​ను ప్రవేశపెట్టనున్నట్లు అజెండాలో పేర్కొన్నారు. అయితే ముఖ్యమైన అంశం అయినందున చర్చించాల్సి ఉంటుందని, అందుకే దీనిని శనివారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్పీకర్​ను కోరారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మట్లాడుతూ.. ‘‘ప్రతిపక్ష సభ్యులను కోరుతున్నా.. ఈ పాపాలన్నింటికీ కారకుడు.. పాపాల భైరవుడు కేసీఆర్ ను కూడా రేపు పొద్దున పిలిపిద్దాం.. నల్గొండ సభకు గంటన్నరలో హెలికాప్టర్ లో వెళ్లిన కేసీఆర్.. ఐదు నిమిషాల్లో చేరుకునేంత దూరంలో ఉన్న అసెంబ్లీకి కారులో రాలేరా?’’ అని ప్రశ్నించారు. 

దీంతో కేసీఆర్ ను పాపాల భైరవుడు అనడంపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంరతం చెప్పారు. వెంకట్ రెడ్డి స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ వాడిన భాష సరిగా ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాపాల భైరవుడని.. మొఖం లేకనే అసెంబ్లీకి రావడం లేదన్నారు. నల్గొండను నాశనం చేశాడని మండిపడ్డారు. కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సభ బయట మాట్లాడిన దాని గురించి సభలో మాట్లాడుతున్నారని.. తమ నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి తుపాకీతో కాల్చి పారేయాలని, ఉరి తీయాలన్నారని చెప్పారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. ఆ వ్యాఖ్యలను పరిశీలించి తొలగిస్తామన్నారు.