శబరిమల రద్దీపై కేరళ హైకోర్టు విమర్శలు : ఏర్పాట్లు ఎందుకు చేయలేదని టీడీబీపై ఆగ్రహం!

శబరిమల రద్దీపై కేరళ హైకోర్టు విమర్శలు : ఏర్పాట్లు ఎందుకు చేయలేదని టీడీబీపై ఆగ్రహం!

శబరిమల ఆలయంలో భక్తుల రద్దీని సరిగ్గా నిర్వహించనందుకు కేరళ హైకోర్టు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిశుభ్రత, తాగునీరు, వసతి, భక్తుల రద్దీ కంట్రోల్ చేయడంలో వెంటనే మెరుగుదలలు చేయాలని కోర్టు ఆదేశించింది. నవంబర్ 16న శబరిమల ఆలయం తెరిచి కేవలం 48 గంటల్లోనే దాదాపు 2 లక్షల మంది భక్తులు కొండపైకి చేరుకోవడంతో ఆలయం వద్ద పరిస్థితి అదుపు తప్పిందని ధర్మాసనం పేర్కొంది.

భక్తులు గంటల తరబడి క్యూలలో వేచి ఉండాల్సి వచ్చిందని, వారికి ఆహారం లేదా తాగునీరు కూడా దొరకలేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ముఖ్యంగా, 18వ పవిత్ర మెట్ల దగ్గర రద్దీ నిర్వహణ పూర్తిగా లోపించిందని కోర్టు గుర్తించింది.

టీడీబీ అధికారులు, పోలీసుల మధ్య సమన్వయం లోపించడం వల్లే ఇంత రద్దీ ఏర్పడిందని ధర్మాసనం ఎత్తి చూపింది. చేయాల్సిన ముఖ్యమైన పనులు ఆరు నెలల ముందే పూర్తయి ఉండాలి అని కోర్టు వ్యాఖ్యానిస్తూ.. ఒకేసారి అంతమంది భక్తులను ఆలయ ప్రాంతంలోకి ఎందుకు అనుమతించారని టీడీబీని ప్రశ్నించింది.

కొత్తగా నియమితులైన టీడీబీ చైర్మన్ కె. జయకుమార్ కూడా పనులు ఆరు నెలల ముందే చేయాల్సిందని అంగీకరించారు. గత కమిటీ కొన్ని పనులు పూర్తి చేయకపోవడం, మొదటి రెండు రోజుల్లో ఇంతమంది భక్తులు వస్తారని ఊహించకపోవడం దీనికి కారణమని ఆయన వివరించారు. ఏ భక్తుడు దర్శనం చేసుకోకుండా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉండదని ఆయన హామీ ఇచ్చారు.

సన్నిధానం, పంబా, నడక మార్గంలో ఎప్పటికి సురక్షితమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలి   అని హైకోర్టు  ఆదేషించింది. నీలక్కల్ నుండి సన్నిధానం వరకు అదనంగా పర్యావరణ అనుకూలమైన బయో-టాయిలెట్‌లను ఏర్పాటు చేయాలని, ప్రతి టాయిలెట్ యూనిట్‌ను ఒక ప్రత్యేక సహాయకుడు నిర్వహించేలా చూడాలి అని తెలిపింది. సన్నిధానంలో అందుబాటులో ఉన్న 423 గదుల్లో 200 గదులను ఆన్‌లైన్ బుకింగ్ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేయాలి. భక్తులను ప్రత్యేక విభాగాలుగా (సెక్టార్స్‌గా) విభజించి, ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా లోపలికి అనుమతించాలని సూచించింది.

ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ముందే చేయాల్సిన పనులు చేయకుండా శబరీ యాత్రకు అంతరాయం కలిగించిందని, భక్తులు 10-15 గంటలు క్యూలలో నిలబడాల్సి వచ్చిందని, నీరు కూడా దొరకలేదని మండిపడ్డారు.