‘భూదాన్’ అక్రమార్కుల వాహనాలు సీజ్

‘భూదాన్’ అక్రమార్కుల వాహనాలు సీజ్
  • రూ.45 లక్షల విలువైన  ఆస్తుల అటాచ్మెంట్ కోసం పోలీసుల చర్యలు 
  • 1549 మంది నుంచి రూ.2.88 కోట్లు వసూలు చేసినట్టు నిందితుల అంగీకారం

ఖమ్మం, వెలుగు: ఖమ్మం అర్బన్​ మండలం వెలుగుమట్లలోని భూదాన్​ భూములను ఆక్రమించి, వాటిని పేదలను అమ్మి  అక్రమార్కులు కూడగట్టిన ఆస్తుల అటాచ్​ మెంట్ కోసం పోలీసులు  చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం రూ.45 లక్షల విలువ చేసే స్థిర, చరాస్తులను అటాచ్ చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిందితులకు చెందిన రూ.10 లక్షల విలువ చేసే ఐదు వాహనాలను సీజ్​ చేశారు. ఖమ్మం సీపీ  సునీల్ దత్ గురువారం  వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు 60 మందికి పైగా నిందితులపై ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్​, ఇతర పోలీస్​ స్టేషన్లలో 30కి పైగా కేసులు నమోదయ్యాయి.  ఏడుగురు ప్రధాన నిందితులను పోలీస్​ కస్టడీకి తీసుకొని వివరాలను రాబట్టారు. బల్లి శ్రీనివాస్, పోలెబోయిన ముత్తయ్య, కొప్పెర వెంకన్న, తాళ్లూరి కృష్ణ, కుంజా కృష్ణయ్య, కల్తీ రామచంద్రయ్య, బాణాల లక్ష్మణాచారిని విచారించారు.

భూదాన్​ ప్లాట్ల పేరుతో సుమారు 1549 మంది నుంచి రూ.2.88 కోట్లు వసూలు చేసినట్టు నిందితులు అంగీకరించారు. ఈ మొత్తం డబ్బుల నుంచి కొంత వరకు కోర్టు ఖర్చులకు, ర్యాలీలు, సర్వేలు, భూదాన్ వినోబా నవోదయ కాలనీలో తాత్కాలికంగా నిర్మించుకున్న ఇండ్లకు కరెంటు, నీరు, మిగతా సౌకర్యాల పేరుతో ఖర్చు చేశారు. మిగిలిన డబ్బును సొంత ఖర్చుల కోసం, స్థిరాస్తుల సంపాదించుకోవడం కొరకు ఖర్చు పెట్టినట్లు నిందితులు నేరాన్ని అంగీకరించారని సీపీ సునీల్ దత్ తెలిపారు.  భూదాన్​ ప్లాట్ల పేరుతో పేదల నుంచి వసూలు చేసిన డబ్బులతో నిందితులు కొనుగోలు చేసిన రూ.10 లక్షల విలువ చేసే ఒక ట్రాక్టర్​, ఒక టాటా మ్యాజిక్​ వాహనం, ఒక టాటా ట్రాలీ ఆటో, రెండు టూవీలర్లను పోలీసులు సీజ్​ చేశారు.

నిందితుడు తాళ్లూరి కృష్ణకు ఖమ్మం కవిరాజ్​ నగర్​ లో 65 గజాల ఇంటి స్థలంతో రెండంతస్తుల భవనం, కొప్పెర వెంకన్నకు చెందిన రూ.10 లక్షల విలువ చేసే ఇంటి స్థలాన్ని గుర్తించారు. చిప్పలపల్లి వీరయ్య దగ్గర రూ.4.50 లక్షల నగదును గుర్తించగా, ఏన్కూరుకు చెందిన పొన్నెబోయిన బేబీ దగ్గర మరో రూ.10 లక్షలు ఉంచారని గుర్తించారు. వీటన్నింటిని చట్టపరంగా అటాచ్​ మెంట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన డబ్బులను ఎలక్షన్ల సమయంలో పార్టీ మీటింగ్ లకు, ఇతర ఖర్చులకు ఈ డబ్బును ఉపయోగించినట్టుగా విచారణలో నిందితులు అంగీకరించారని సీపీ సునీల్ దత్ తెలిపారు. పోలీస్​ కస్టడీ ముగిసిన తర్వాత నిందితులను తిరిగి గురువారం జ్యుడిషియల్ రిమాండ్​ కు తరలించామని చెప్పారు.