- ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం సిగ్గుచేటు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్/ హైదరాబాద్సిటీ, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని, ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి గంతేయడం ఆ పార్టీ నాయకులకు అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వరం నియోజకవర్గంలో గెలిచిన బీజేపీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను సన్మానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచందర్రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సర్పంచ్లను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో విలువలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జెండాపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు సిగ్గువిడిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని, ఇది ప్రజల తీర్పుకు వెన్నుపోటు పొడవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ మారి కూడా ‘మేం పార్టీ మారలేదు.. గులాబీ గూటిలోనే ఉన్నాం’ అంటూ మళ్లీ ప్లేటు ఫిరాయించడం ఆ ఎమ్మెల్యేల దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. సాక్షాత్తూ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ధర్మబద్ధంగా వ్యవహరించకుండా, ఫిరాయింపు ఎమ్మెల్యేలను వెనకేసుకురావడం అన్యాయమని, ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రులను చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తున్నదని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పల్లె ప్రగతికి పెద్దపీట వేస్తున్నదని అన్నారు. ఏటా రైతుల ఖాతాల్లో రూ.6 వేలు వేస్తున్నదని, పేదలకు ఉచిత బియ్యం, వ్యవసాయ సబ్సిడీలు ఇస్తున్నదని గుర్తుచేశారు. గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు బాధ్యతతో పనిచేసి గ్రామాల రూపురేఖలు మార్చాలని కిషన్ రెడ్డి సూచించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలన్నారు. అవినీతి, కుటుంబ పాలన సాగిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలన్నారు.
ముగిసిన 26వ అఖిల భారత పోలీస్బ్యాండ్ పోటీలు
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మౌలాలీ ఆర్‌పీఎఫ్ శిక్షణ కేంద్రంలో ఈ నెల 16 నుంచి 20 వరకు నిర్వహించిన 26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు శనివారం ముగిశాయి. ముగింపు వేడుకకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అత్యుత్తమ ప్రదర్శన చేసిన బ్యాండ్ జట్లకు అవార్డులు, ట్రోఫీలు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. క్రమశిక్షణ, ఐక్యత, సాంస్కృతికతను పెంపొందించడంలో పోలీస్ బ్యాండ్‌ల పాత్ర ప్రశంసనీయమని అన్నారు.
మార్షల్ సంగీతం బలగాలకు ఉత్తేజాన్ని ఇస్తుందని, దేశ రక్షణ పట్ల నిబద్ధతను ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు. దేశంలోని పోలీసు బలగాలు అవసరమైనప్పుడు స్నేహితుల్లా నిజాయితీతో సేవలందిస్తాయని, ప్రజల అంచనాలకు అనుగుణంగా జీవించాల్సిన పవిత్ర బాధ్యత ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర పోలీసు బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, ఇతర యూనిఫాం సేవలకు చెందిన 24 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.
