
- మతప్రాతిపదికన ముస్లింలను బీసీల్లో చేర్చారు: కిషన్రెడ్డి
- భూసేకరణ సమస్యలతో రైల్వే, నేషనల్ హైవేల పనులు లేట్ అవుతున్నాయని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కులగణన కాదని, అది కులాల సర్వే అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. అది కూడా తూతూ మంత్రంగానే ముగించిందని తెలిపారు. బీసీలకు అన్యాయం చేసేలా మత ప్రాతిపదికన ముస్లింలను బీసీ జాబితాలో చేర్చారని అన్నారు.
శనివారం నాంపల్లిలోని పార్టీ స్టేట్ఆఫీస్లో కిషన్రెడ్డి మాట్లాడారు. జనగణనతోపాటు కులగణన చేయడానికి కేంద్రం అంగీకరించిందని, మారుమూల ప్రాంతాల్లోని ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి, ప్రతి ఇంటికి వెళ్లి పారదర్శకంగా జనాభా లెక్కలతోపాటు కులగణన చేయనున్నామని వెల్లడించారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్ణయం తీసుకుందన్నారు.
రాష్ట్రంలో భూసేకరణ సమస్యలు
రాష్ట్రంలో భూసేకరణ సమస్యల వల్ల రైల్వే, నేషనల్ హైవేల పనులు ఆలస్యంగా సాగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో గత సీఎం కేసీఆర్ తోపాటు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి భూసేకరణ వేగంగా పూర్తిచేయాలని తాను పలుమార్లు లేఖలు రాసినట్లు గుర్తు చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలను నేషనల్ హైవేలతో కనెక్ట్ చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని చెప్పారు. 2014లో రాష్ట్రంలో 2,500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఉండగా, ఇప్పుడు సుమారు 5,200 కిలోమీటర్లకు పెరిగాయన్నారు. రాష్ట్ర పరిధిలో దాదాపు రూ. 4,500 కోట్లతో 136 కిలో మీటర్ల మేర పనులు జరుగుతున్నాయని వివరించారు.